YS Sharmila: పాలేరు నుంచి పోటీ చేస్తే షర్మిల ఎమ్మెల్యే అయిపోయినట్టేనా?.. వ్యూహం మామూలు లేదుగా!
ABN, First Publish Date - 2023-05-02T15:24:21+05:30
‘నేను పాలేరులోనే పోటీ చేస్తా.. ఎలాంటి అపోహలు అవసరం లేదు’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మరి పాలేరు నియోజకవర్గాన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి?. ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు సులభమా? దీని వెనుక ఆమె వ్యూహాలు ఏమిటి?...
వైఎస్ షర్మిల (YS Sharmila) స్థాపించిన వైఎస్సార్‌టీపీ (YSRTP) తెలంగాణలో ఇంకా బలపడకపోవచ్చు! ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో కేడర్ లేకపోవచ్చు! కానీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి ఎండగట్టే విషయంలో ఆ పార్టీ ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉంటోంది. పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్షేత్రస్థాయిలోనే ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీస్తున్నారు. అరెస్టులను సైతం ఆమె లెక్కచేయడం లేదు. తద్వారా ఇక్కడి రాజకీయాల్లో బలపడాలనే తన ఆకాంక్షను చాటిచెబుతున్నారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలనే లక్ష్యమని చెబుతున్న షర్మిల ఈ సారి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇందుకు ఖమ్మం జిల్లాలోని (Khammam district) పాలేరు నియోజకవర్గాన్ని (Palair Assembly constituency) ఆమె ఎంచుకున్నారు. ఇక్కడి నుంచే బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇదే విషయంపై సోమవారం మరోసారి క్లారిటీ ఇచ్చారు. రెండు రోజుల పాలేరు నియోజకవర్గం పర్యటనలో ఉన్న ఆమె సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ‘నేను పాలేరులోనే పోటీ చేస్తా.. ఎలాంటి అపోహలు అవసరం లేదు’ అని అన్నారు. మరి షర్మిల పాలేరు నియోజకవర్గాన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి?. ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు సులభమా? దీని వెనుక ఆమె వ్యూహాలు ఏమిటి? అనే ఆసక్తికర విషయాలను ఒకసారి పరిశీలిద్దాం...
పాలేరుపై గురి ఇందుకేనా...
వైఎస్ షర్మిల చాలా వ్యూహాత్మకంగానే పాలేరును ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. రాజకీయ చైతన్యం ఉందని పేరున్న ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా పోటీచేస్తే విజయావకాశాలు మెరుగవుతాయనేది షర్మిల ఆలోచన కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మరోవైపు ఇది జనరల్ స్థానమే అయినప్పటికీ గిరిజనులు అధికంగా ఉన్నారు. కాబట్టి గిరిజనుల్లో వైఎస్సార్‌కు ఉన్న ఆదరణను ఓట్లుగా మలుచుకోవడం సులభమని షర్మిల లెక్కలేస్తున్నట్టు రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వైఎస్సార్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని టాక్ ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సంక్షేమ పథకాలు పొందినవారు షర్మిలకు ఓట్లు వేయొచ్చనే చర్చ కూడా ఉంది.
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్యే సీట్లతోపాటు ఒక ఎంపీ సీటును గెలుచుకుంది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఏపీపైనే ఫోకస్ పెట్టి తెలంగాణలో పార్టీని పట్టించుకోలేదు. అయినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరించాయి. దీంతో ఆ జిల్లాలో వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే నమ్మకం ఏర్పడింది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ పార్టీకీ ఏకపక్ష ఆదరణ లభించిన పరిస్థితులు కనిపించవు. కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలతోపాటు టీడీపీకి కూడా ఇక్కడ మంచి ఓటు బ్యాంకు ఉంది. పాలేరు నియోజకవర్గంలో కూడా పార్టీలు సమవుజ్జీలుగా పోటీపడే అవకాశాలున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు సమ బలంతో ఉన్న పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవచ్చునేది షర్మిల అంచనా వ్యూహం అవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఎన్నికల సమయంలో షర్మిలకు ఏ పార్టీ అయినా మద్ధతు ఇస్తుందా?. లేదా ఒంటరిగానే బరిలో దిగుతారా?. ఆమె పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం అనేది మాత్రం ఎన్నికల సమయంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా పాలేరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. దీంతో సీటు విషయంలో తనపై పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావుతో పోటీ ఏర్పడినట్టయ్యింది. ఇక ఈ నియోజకవర్గాన్ని ఎక్కువసార్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దించుతుంది, వామపక్షాలు ఏం చేయబోతున్నాయి, పొత్తు-ఎత్తులు ఏవిధంగా ఉంటాయనేది వైఎస్ షర్మిల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. మరి షర్మిల ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అవుతారా లేదా అనేది మాత్రం ఎన్నికల్లోనే తేలనుంది.
ఇవి కూడా చదవండి...
Rajanikath row: సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కారణమా? సడెన్‌గా తెరపైకి చివరిలేఖ ఇదేనంటూ వైరల్... అందులో ఏముందంటే..
SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..
Updated Date - 2023-05-02T15:29:51+05:30 IST