BJPని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న కేసీఆర్..మరోవైపు BRSపై ఆదివాసుల సీరియస్..!
ABN, First Publish Date - 2023-02-23T13:26:41+05:30
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో మరో సారి అలజడి చెలరేగింది. కొత్తగా 11కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ చేసిన...
ఆదివాసీ ఉద్యమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తోందా?.. కొత్తగా 11కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం వివాదస్పదం అవుతోందా?.. కేసీఆర్ సర్కారుపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా?.. బాల్ ను కేంద్రం కోర్టులోకి నెట్టడం ద్వారా బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారా?.. గత అనుభవాల నుంచి తెలంగాణ ప్రభుత్వం పాఠం నేర్చుకోవడం లేదా?.. ఇంతకీ.. తెలంగాణ ప్రభుత్వంపై ఆదివాసులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?.. అసలు.. గత అనుభవాల సంగతేంటీ?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్సైడ్లో తెలుసుకుందాం..
11 కొత్త కులాలను ఎస్టీల్లో చేర్చుతూ తీర్మానం
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో మరో సారి అలజడి చెలరేగింది. కొత్తగా 11కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఆదివాసులు రగిలి పోతున్నారు. ఇప్పటికే తమ రిజర్వేషన్లను లంబాడాలు అనుభవిస్తున్నారని ఆరోపిస్తూ.. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మరో తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో వెనుక బడ్డ ‘‘వాల్మీకి బోయ, బేదర్, కిరాతక, నిషాధి, పెద్ద బోయలు, తలయారి, చుండువాళ్లు, ఖాయితీ లంబాడ, భాట్ మధురలు, చమర్ మధురలతో పాటు మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తద్వారా.. బాల్ ను కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది.
6 ఏళ్లుగా ఉద్యమం చేస్తుంటే స్పందించలేదని ఆగ్రహం
ఇక.. అసెంబ్లీ తీర్మానం చేసి పంపడంపై ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. లంబాడాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని.. 6 ఏళ్లుగా ఉద్యమం చేస్తుంటే స్పందించని ప్రభుత్వం మరిన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ తీర్మానం ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ కేంద్రంగా మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో గిరిజనులు ఐటిడిఏ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు ఎవరూ అందుబాటులో లేక పోవడం తో ఆందోళన కారులు సహనం కోల్పోయారు. కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఒక దశలో పరిస్థితి మళ్ళీ చేజారేలా కనిపించింది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చొరవతో వివాదం సద్దు మణిగింది. ఐటిడిఏ ఇంచార్జి పీవో వరుణ్ రెడ్డి హామీతో ఆందోళన విరమించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పై కోపంతో రగిలి పోతున్న ఆదివాసులు మళ్ళీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చ రించడం కలకలం రేపుతోంది.
రిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ జీవో
వాస్తవానికి... తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి పాఠం నేర్చుకోలేదన్న చర్చ సాగుతోంది. లంబాడాలకు వ్యతిరేకంగా 2017అక్టోబర్లో మొదలైన తుడుం దెబ్బ ఉద్యమం.. ఒక దశలో శాంతి భద్రతల సమస్యగా మారింది. ఉట్నూర్ కేంద్రంగా భారీ విధ్వంసం జరిగింది. రోజుల తరబడి కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఆ క్రమంలో అప్పటి కలెక్టర్లు, ఎస్పీలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ముఖ్య అధికారులంతా ఉట్నూర్ కు వచ్చారు. ఆదివాసుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే.. అవేవి ఇప్పటికీ అమలు కాలేదు. ఇంతలోనే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాంతో ఆదివాసులు మళ్ళీ ఆందోళన బాట పట్టారు. సుప్రీంకోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేయడంతో వివాదం సద్దు మణిగింది. కానీ.. ఇప్పుడు.. 11కులాలను ఎస్టీల్లో చేర్చుతూ అసెంబ్లీ తీర్మానం చేయడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయ్యింది.
రెండు హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్
ఇదిలావుంటే.. గిరిజన రిజర్వేషన్ల పెంపు, ఆయా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని గులాబీబాస్ ఉద్యమకాలంలోనే హామీ ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయా వర్గాల్లో అసంతృప్తి రాజుకుంది. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయంగా నష్టం జరుగుతుందని అంచనా వేసిన కేసీఆర్.. పథకం ప్రకారం రెండు హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. ఇపుడున్న పరిస్థితుల్లో కేంద్రం అంగీకరించదని తెలిసే.. కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు చర్చ జరుగుతోంది. తాము చేసినా.. కేంద్రం ఒప్పు కోవడం లేదన్న ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. తద్వారా ఆయా వర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో దూసుకొస్తున్న బీజేపీని ఢీకొట్టేందుకే సున్నితమైన ఆ అంశాలను తెరపైకి తెచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై భిన్నాభిప్రాయాలు
వాస్తవానికి.. తెలంగాణలో ఎస్సీ-ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ రచిస్తున్న వ్యూహానికి విరుగుడుగా.. గిరిజన రిజర్వేషన్ల పెంపును వాడుకుంటున్నట్టు చర్చ నడుస్తోంది. అయితే.. గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రకటనను లంబాడీలు స్వాగతిస్తుండగా.. ఆదివాసుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేసీఆర్ న్యాయం చేయాలనుకుంటే.. ఆదివాసులు అడ్డుకుంటున్నారన్న భావన లంబాడీల్లో ఏర్పడుతోంది. ఇది కాస్త.. ఎస్టీ నియోజకవర్గాల్లో విజయానికి బాట పడుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా... తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు వ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. అందులోనూ... బీఆరెస్ కాస్త వేగంగా అడుగులు వేస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా ఆదివాసుల్లో ఆశించిన పట్టు దొరక్కపోవడంతో.. లంబాడీల ఓట్లు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... ఆదిలాబాద్ ఆదివాసుల పోరాటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి..
Updated Date - 2023-02-23T13:30:59+05:30 IST