Tarakaratna Lokesh Meet: తారకరత్న, లోకేష్ భేటీ.. మర్యాదపూర్వకంగా కలిసినట్టు బయటకు చెబుతున్నప్పటికీ..
ABN, First Publish Date - 2023-01-10T15:24:06+05:30
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌తో (Nara Lokesh) నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నప్పటికీ..
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌తో (Nara Lokesh) నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నప్పటికీ తాజా రాజకీయ పరిణామాల (AP Politics) గురించి ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కుటుంబ విషయాలతో పాటు ప్రధానంగా ఏపీ రాజకీయాలపై ఈ ఇద్దరూ ముచ్చటించుకున్నట్టు టాక్. తారకరత్న అడపాదడపా సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తున్నప్పటికీ చెప్పుకోతగిన రీతిలో ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆయనకు అవకాశాలు రావడం లేదు. ప్రతినాయకుడి పాత్రలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అయితే.. ఇటీవల తారకరత్న ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారక రత్న ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. దీంతో.. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆ సీటు కేటాయించనున్నారు, ఈ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలపనున్నారని తారకరత్న గురించి పలు రకాల ఊహాగానాలు, ప్రచారాలు ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగాయి. ఈ నేపథ్యంలో.. నారా లోకేష్, తారకరత్న భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీడీపీ యువనేత లోకేష్ ‘యువ గళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 27 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో.. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకే తారకరత్న కలిసి ఉంటారనే ప్రచారం కూడా మొదలైంది. తారకరత్న టీడీపీ తరపున గతంలో ప్రచారం కూడా చేశారు. ఆయన పోటీ చేయాలని డిసైడ్ అవ్వాలే గానీ అసెంబ్లీ సీటు కేటాయించేందుకు టీడీపీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉంది. అయితే.. తారకరత్నకు ఎమ్మెల్యే టికెట్ ఏ స్థానం నుంచి కేటాయిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. లోకేష్‌తో ఇదే విషయంలో క్లారిటీ తీసుకునే ఉద్దేశంతోనే తారకరత్న భేటీ అయినట్లు సమాచారం.
Updated Date - 2023-01-10T15:24:30+05:30 IST