Nara Lokesh: లోకేశ్ స్కెచ్ మాములుగా లేదుగా.. ఒకవైపు యువగళం పాదయాత్ర చేస్తూ.. మరో పక్క..
ABN, First Publish Date - 2023-06-15T11:55:43+05:30
నారా లోకేశ్, మరోసారి తన ప్రత్యేక సర్వే బృందాన్ని రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇప్పటికే లోకేశ్ పంపిన ప్రత్యేక సర్వే బృందం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల పనితీరుపై రహస్య సర్వే చేస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.
లోకేశ్ ఫోకస్..!
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరుపై రహస్య సర్వే
ఉమ్మడి జిల్లాకు నారా లోకేశ్ ప్రత్యేక బృందం
ప్రజలతో ఇన్‌చార్జిలు మమేకమౌతున్నారా..?
పార్టీ సూచించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా..?
అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై ఎలా స్పందిస్తున్నారు..?
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తున్నారు..?
ప్రాధాన్య అంశాలపై ప్రశ్నావళితో రంగంలోకి సర్వే బృందం
యువగళం ముందు... తర్వాత పరిస్థితులు పరిగణనలోకి..
పనిలో పనిగా కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ
అనంతపురం (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. 2024లో జరగబోయే ఈ ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2014 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. వచ్చే ఎన్నికల్లో పునరావృతమయ్యేలా పార్టీ అధినాయకత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. బాదుడే బాదుడు కార్యక్రమంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు స్పష్టమైన సూచనలు చేశారు. గెలుపు గుర్రాలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉంటాయని కుండ బద్దలు కొట్టారు. ప్రజల్లో ఉంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సఫలీకృతులవుతారో, పార్టీ పరంగా ప్రజాభిమానాన్ని చూరగొంటారో.. వారికే ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలు పంపారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు నెల రోజులపాటు యువగళం పాదయాత్ర చేశారు.
యువగళం పాదయాత్రకు ముందు ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరు, పార్టీ బలాబలాలను అంచనా వేశారు. యువగళం పాదయాత్ర తర్వాత పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న ఒక సర్వే బృందం ఇప్పటికే రెండుసార్లు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసి.. ఆ నివేదికను పార్టీ అధినాయకత్వానికి అందించింది. ఆ నివేదికలు అలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో 4 వేల కి.మీ. పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్, మరోసారి తన ప్రత్యేక సర్వే బృందాన్ని రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇప్పటికే లోకేశ్ పంపిన ప్రత్యేక సర్వే బృందం ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల పనితీరుపై రహస్య సర్వే చేస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.
కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేక పవనాలు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ముందు, ఆ తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరుపైనే లోకేశ్ ప్రత్యేక సర్వే బృందం ఆరా తీసినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరుకు ‘ప్రజలతో మమేకం, వర్గవిభేదాలను సమన్వయం చేసుకోవడం, అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దందాలపై నిలదీత’ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు నియోజకవర్గాలలో ఇన్‌చార్జిలకు ఉన్న ప్రజా బలాన్ని ప్రత్యేకంగా చూస్తున్నట్లు సమాచారం. సర్వేలో ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు తేలిందని విశ్వసనీయంగా తెలిసింది. శ్రీసత్యసాయి జిల్లాలో రెండు నియోజకవర్గాలు, అనంతపురం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో వర్గవిభేదాలను సమన్వయం చేసుకోవడంలో ఇన్‌చార్జిలు చొరవ చూపలేదని సర్వేలో బహిర్గతమైనట్లు సమాచారం. పార్టీ అధినాయకత్వం సూచించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలోనూ కొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పట్టించుకోలేదని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై బహిరంగ సభలు, సెల్ఫీ చాలెంజ్‌ల ద్వారా ఎండగట్టారు. కానీ కొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు స్థానిక ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టడానికి ఏమాత్రం చొరవ చూపలేదని సర్వేలో స్పష్టంగా తేలినట్లు సమాచారం.
సర్వే బృందం సంధిస్తున్న ప్రశ్నలివే..
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు మినహా.. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 12 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పనితీరును సర్వే బృందం మొదటి ప్రాధాన్య అంశంగా తీసుకుంది. నియోజకవర్గ ఇన్‌చార్జిలు ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు..? ప్రజల సమస్యలపై ఏ మేరకు పోరాడుతున్నారు..? పార్టీ అధినాయకత్వం ఆదేశించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా..? లేదా..? పార్టీ కార్యక్రమాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారా..? అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు, అక్రమాలు, దందాలను ఎండగడుతున్నారా..? లేదా..? వర్గ విభేదాలు ఉన్నచోట అందరినీ సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారా..? లేదా.? ఆ విషయంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలు ప్రత్యేక చొరవ చూపుతున్నారా..? లేక.. ఎవరిదారి వారిదే అన్న చందంగా వ్యవహరిస్తున్నారా..? తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారా..? లేదా..? వైసీపీ నాలుగేళ్ల పాలనలో బటన్ నొక్కుడు తప్ప.. ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారా..? లేదా.. ఇలా అనేక అంశాలను సర్వే బృందం ప్రశ్నల రూపంలో సంధించి.. సమాధానాలు రాబడుతున్నట్లు సమాచారం.
కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లోకేశ్ పంపిన ప్రత్యేక సర్వే బృందం.. సర్వేతోపాటు పనిలోపనిగా కొత్త అభ్యర్థుల కోసం ఆరా తీసినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో కులాల సమీకరణను పరిగణలోకి తీసుకుని, ఆయా సామాజికవర్గాల్లో బలమైన వ్యక్తులపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, రాజకీయాల్లో లేని వ్యక్తుల బలాబలాలపైనా ఆరా తీసినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారిపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికారపార్టీ ఎత్తులకు పైఎత్తులు వేసేవిధంగా సర్వే నివేదికలు రూపొందించే పనిలో సర్వే బృందం నిమగ్నమైంది. అతి త్వరలో సర్వే నివేదికలను నారా లోకేశ్‌కు సమర్పించననున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Updated Date - 2023-06-15T11:55:57+05:30 IST