Nara Lokesh: పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌పై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-02-24T19:24:58+05:30
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లోకేష్ వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనస్సు అని లోకేష్ అన్నారు. అలాంటివారు సమాజాన్ని ముందుకుతీసుకెళ్లేందుకు రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. 1983, 1985 ఈ రెండుసార్లు మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిందని, టీడీపీ గెలవని చోట గెలిచి, కంచుకోటగా మార్చాలనుకున్నానని లోకేష్ స్పష్టం చేశారు.
మొదటిసారి ఫెయిల్ అయ్యా.. అయినా తనలో ఫైర్ ఉందని, 2024లో మంగళగిరిలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ఈ మూడు కలిసి కట్టుగా వెళ్తేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, టీడీపీ హయాంలో 40వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. 32 వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, సులభ రుణాలతో స్వయం ఉపాధి కల్పించామన్నారు. 35 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నామని లోకేష్ అన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, రాజకీయ కక్షతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, కక్ష సాధింపునకు చూపే శ్రద్ధలో కొంత అభివృద్ధిపైన చూపితే పరిశ్రమలు వస్తాయని లోకేష్ తెలిపారు.
తిరుమలలో పింక్ డైమండ్ కొట్టేసినట్టు ఆరోపణలు చేసిన వారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం చేశారని, ప్రజలందరూ ఆరోపణలు చేయటం సులభమని, తాను చిత్తశుద్ధితో పని చేశానని, ఏ నాడు తప్పు చేయలేదని లోకేష్ వెల్లడించారు. అన్న క్యాంటీన్లను మూసేయటం బాధాకరమని, టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి వంద రోజుల్లోనే అన్న క్యాంటీన్లను తెరుస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
Updated Date - 2023-02-24T19:55:19+05:30 IST