Rajahmundry: రాజమండ్రి వైసీపీలో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు
ABN, First Publish Date - 2023-03-25T12:41:04+05:30
రాజమండ్రి వైసీపీలో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే
రాజమండ్రి వైసీపీలో అలజడి మొదలైందా..? వైసీపీ యువజన విభాగం రీజినల్ కో-ఆర్డినేటర్‌గా జక్కంపూడి గణేష్ నియామకంతో రాజకీయ పరిణామాలు మలుపు తిరుగుతున్నాయా? రాజమండ్రి సిటీ తన అడ్డా అంటూ ప్రకటించిన ఎంపీ మార్గాని భరత్ రూరల్ నియోజకవర్గంపై ఆసక్తి చూపుతున్నారా..? నేతల మధ్య ఆధిపత్యపోరుతో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కీలక నేతల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందా..? రాజమండ్రి వైసీపీలో విభిన్న రాజకీయ పరిస్థితులపై ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం...
ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి మధ్య అంతర్గత పోరు
రాజమండ్రి వైసీపీలో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజాల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. ఈ యువనేతలిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ క్యాడర్ రెండుగా చీలింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ భరత్ కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లను గాలికొదిలేసి... ఎమ్మెల్యే అవతారమెత్తి రాజమండ్రి సిటీకే పరిమితమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి భరత్ పోటీ
జిల్లా అధ్యక్షుని హోదాలో ఉన్న జక్కంపూడి రాజా రాజమండ్రిలో ఎంపీని కాదని తన హవా కొనసాగించలేకపోతున్నారనే ఆవేదన క్యాడర్‌లో ఉంది. రాజమండ్రిలో డివిజన్ల ఇన్‌చార్జ్‌ల పదవి నుంచి తన అనుచరులను ఎంపీ తొలగించినా జిల్లా అధ్యక్ష హోదాలో ఉండి వారికి న్యాయం చేయలేక పోయారనే భావన క్యాడర్‌లో ఉంది. ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ డైరెక్టర్ల పదవుల్లోనూ జక్కంపూడి అనుచరులను ఎంపీ తొలగించారు. రాజమండ్రి వైసీపీ నగర అధ్యక్ష పదవిలో ఉన్న జక్కంపూడి అనుచరుడు నందెపు శ్రీనివాస్‌ను పదవి నుంచి ఎంపీ తొలగించారు. ప్రస్తుతం రాజమండ్రి సిటీలో ఎంపీ భరత్ మాటే చెల్లుబాటవుతోంది. అధికార యంత్రాంగంపైనా ఎంపీ భరత్ పెత్తనం చెలాయిస్తున్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ భరత్ పోటీ చేస్తారని, రాజమండ్రి సిటీలో జక్కంపూడి రాజాను జోక్యం చేసుకోవద్దని పార్టీ అధిష్టానం ఆదేశించిందనే ప్రచారం కొనసాగుతోంది.
పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న జక్కంపూడి గణేష్
ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్‌ను వైసీపీ యువజన విభాగం రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పార్టీ అధిష్టానం నియమించింది. గణేష్ నియామకంతో పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ జక్కంపూడి గణేష్ ప్రకటనతో వైసీపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. జక్కంపూడి గణేష్‌కు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉందని, ఒకవేళ పార్టీ అధిష్టానం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే గణేష్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక దానిని ఎంచుకుంటారనే ప్రచారం సాగుతుంది.
ఎంపీ నిర్ణయం మారడంతో చందన నాగేశ్వర్ పరోక్షంగా వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా ఉన్న చందన నాగేశ్వర్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, పార్టీలో కొంతమంది తన వెంట ఉంటూనే గోతులు తవ్వుతున్నారంటూ చందన నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జక్కంపూడి గణేష్ నియామకం నేపథ్యంలో ఎంపీ భరత్ కూడా తన అనుచరుడు పితాని మురళీ రామకృష్ణను రాజమండ్రి వైసీపీ యువజన విభాగం అధ్యక్షునిగా నియమించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఎంపీ భరత్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ నిర్ణయం మారటం వల్లే రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా ఉన్న చందన నాగేశ్వర్ ఎంపీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఎంపీ తీరుకు నిరసనగా గతంలో గణేష్ ఆందోళనలు
ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలపై స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని సర్దిచెప్పినా సఖ్యత కుదరలేదు. ఎమెల్యే జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నా... రాజమండ్రి సిటీ నియోజకవర్గం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదు. అయితే యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమితులైన జక్కంపూడి గణేష్ రాజమండ్రి సిటీ నియోజకవర్గంపైనా ఫోకస్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వైసీపీ యువ సమ్మేళనం బహిరంగ సభను రాజమండ్రిలోనే భారీ ఎత్తున నిర్వహిస్తామని గణేష్ ప్రకటించారు. అయితే ఎంపీ భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.
గతంలో రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపీ తీరుకి వ్యతిరేకంగా జక్కంపూడి గణేష్ ఆందోళన చేయటం, ఎంపీకీ పోటీగా ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలకు రక్తదానం చేయటం, ఎంపీ భరత్‌ను సస్పెన్షన్ చేయించిన బీసీ నేత నరవ గోపాలకృష్ణకు సంఘీభావం తెలిపి అధిష్టానంతో మాట్లాడతానని హామీ ఇవ్వటం వంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల పదవి లభించిన సందర్భంగా జక్కంపూడి గణేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ భరత్ ఫోటోను ఫ్లెక్సీపై కూడా వేయలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజమండ్రి వైసీపీలో ఒకపక్క ఎంపీ భరత్, మరోపక్క జక్కంపూడి బ్రదర్స్ ఆధిపత్య పోరులో పైచేయి సాధించేదెవరో, అధిష్టానం ఎవరికి జై కొడుతుందో వేచిచూడాల్సిందే...
Updated Date - 2023-03-25T12:41:04+05:30 IST