Magunta: మాగుంటకు జగన్ హ్యాండ్ ఇచ్చినట్టేనా.. ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే..
ABN, First Publish Date - 2023-02-12T17:13:40+05:30
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు, వైసీపీ యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి (Magunta Raghava Reddy) అరెస్టుతో వైసీపీ వర్గీయుల్లో..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు, వైసీపీ యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి (Magunta Raghava Reddy) అరెస్టుతో వైసీపీ వర్గీయుల్లో కలకలం ఆరంభమైంది. రాజకీయ అరంగేట్రంలోనే రాఘవరెడ్డి మెడకు ఈడీ కేసు (ED Case) చుట్టుకోవడం చర్చనీయాంశమైంది. అనూహ్యంగా ఎంపీ కంటే రాఘవరెడ్డి పాత్ర అధికంగా ఉన్నట్లు ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో చూపించారు. అదే వైసీపీలోనూ (YCP), ప్రత్యేకించి మాగుంట కుటుంబ అభిమానుల్లోనూ అందోళనలు రేకెత్తిస్తోంది. అయితే రాజకీయంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్రలో భాగంగానే ఎంపీ మాగుంట, ఆయన కుమారుడు రాఘవరెడ్డిలను ఇరికించారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. అయినా ఈ వ్యవహారం రాఘవరెడ్డి రాజకీయ భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అనుమానాలు ఆరంభమయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధానంగా ఉత్తర భారతదేశ వ్యాపారులకు, దక్షణ భారతదేశ రాష్ర్టాల ప్రతినిధుల నుంచి వంద కోట్లు ముడుపులు ముట్టిన వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర కీలకంగా ఉందని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంతేగాక ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు (KCR Daughter Kavitha) ప్రతినిధిగా వ్యవహరించారని ఆ రిపోర్టులో పేర్కొనటం చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసు వ్యవహారంలో మాగుంట, ఆయన కుమారుడి పాత్రపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్టులో ఇటు ఈడీ, అటు మాగుంట తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను పరిశీలిస్తే తాత్కాలికంగా ఈ వ్యవహారంలో తండ్రీకొడుకులు పీకల లోతున ఇరుక్కుపోయినట్లు అర్థమవుతుంది. అనూహ్యంగా ఎంపీ మాగుంట కన్నా కుమారుడు రాఘవరెడ్డి పాత్ర అధికంగా ఉన్నట్లు ఈడీ అధికారులు చూపించారు. అదే వైసీపీలోనూ, ప్రత్యేకించి మాగుంట కుటుంబ అభిమానుల్లోనూ అందోళనలు రేకెత్తిస్తోంది.
ఈ వ్యవహారంలో మాగుంట కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) నుంచి మద్దతు లభిస్తుందా? లేదా? అన్న అనుమానాలు ఆరంభమయ్యాయి. వైసీపీకి చెందిన రాజకీయ విశ్లేషకులతోపాటు ఇతరులు కూడా జగన్ సహకారం ఉండకపోవచ్చనే భావన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాజకీయంగా వివాదాలకు అతీతంగా, వ్యాపార పరంగా సమస్యలు లేకుండా ముందుకు సాగుతున్న మాగుంట కుటుంబం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. అందువలనే స్థానికంగా వ్యాపారాలు ఆపేసి ఇతర దేశాలు, రాష్ర్టాల్లో వ్యాపారాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రాజకీయంగా ఇప్పటికీ మాగుంట కుటుంబానికి వైసీపీ అధినేత మద్దతుగా ఉన్నప్పటికీ ఈ కేసులో మాగుంట కుటుంబం చిక్కుకున్న తర్వాత ఆయనకు మద్దతుగా బహిరంగంగా ఎవరూ స్పందించకపోవటం చర్చనీయాంశమైంది. కనీసం సొంత జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా ఈ వ్యవహారంలో ఆయనకు మద్దతుగా బహిరంగా వ్యాఖ్యానించలేదు. దీంతో మున్ముందైనా జగన్ మాగుంటకు సహకరిస్తారా? చివరకు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.
గత సాధారణ ఎన్నికల సమయంలో కేవలం ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే పరిమితమై ఆ తర్వాత వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న రాఘవరెడ్డి రెండు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధినేత జగన్ అంగీకరిస్తే ఒంగోలు లోక్‌సభ స్థానం (Ongole Lok Sabha Constituency) నుంచి రాఘవరెడ్డి పోటీ చేస్తారని కూడా ఎంపీ శ్రీనివాసులరెడ్డి (YCP MP Srinivasulu Reddy) ప్రకటించారు. దీన్ని బట్టి మాగుంట రాజకీయ వారసుడిగా కొడుకును చూడాలని కోరుకున్నట్లు తేటతెల్లమైంది.
పోటీచేసేందుకు ఎవరికి అవకాశం ఇచ్చినా మాగుంట కుటుంబానికే ఒంగోలు లోక్‌సభ స్థానం అన్న రీతిలో వైసీపీ అధినాయకత్వం వ్యవహరించింది. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి కేసులో చిక్కుకొని అరెస్టు కావటంతో ఆయన రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందనే అనుమానాలు పెరిగాయి. కాగా రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా రాఘవరెడ్డి వ్యవహరించారన్న రిమాండ్ రిపోర్టులోని పాయింట్‌ను మాగుంట అభిమానులు ప్రస్తావిస్తూ ఇదంతా ఒక కుట్రలో భాగమని వ్యాఖ్యానిస్తున్నారు.
Updated Date - 2023-02-12T17:13:57+05:30 IST