TS Congress : నిన్న కాంగ్రెస్‌లో చేరిక.. ఇవాళ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్.. సడన్‌గా ఎందుకిలా..!?
ABN, First Publish Date - 2023-03-27T17:05:09+05:30
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Dharmapuri Srinivas ) ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్ (TS Congress) గూటికి చేరిన డీఎస్..
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Dharmapuri Srinivas ) ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్ (TS Congress) గూటికి చేరిన డీఎస్.. ఒక్కరోజు కూడా గడువక ముందే హస్తం పార్టీకి రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డీఎస్ పంపారు. మరోవైపు.. ఆయన సతీమణి విజయలక్ష్మి (DS Wife Vijayalakshmi) కూడా మరో లేఖను విడుదల చేశారు. మొదట్నుంచీ కాంగ్రెస్ వాది అయిన డీఎస్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీలో (TRS Party) చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా టీఆర్ఎస్ తీర్థమే పుచ్చుకున్నారు. ధర్మపురి అరవింద్ మాత్రం మొదట్నుంచీ బీజేపీలో (BJP) ఉంటూ వస్తున్నారు. ఇలా తండ్రి ఒక పార్టీలో.. కుమారుడు మరో పార్టీలో ఉంటూ వస్తున్నారు. ఇలా చాలా రోజులు డీఎస్ కుటుంబంలో (DS Family) చేరికల చిచ్చు నడుస్తోంది. ఆ మధ్య రెండు, మూడేళ్ల పాటు డీఎస్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు డీఎస్.
24 గంటల్లోనే ఏమైందో..!
వాస్తవానికి డీఎస్ చాలా రోజులు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి డీఎస్ చేరికకు అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. ఆయన తనయుడు ధర్మపురి సంజయ్ చేరిక ప్రతిపాదనపైన నిజామాబాద్ (Nizamabad) కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో డీఎస్ చేరిక వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న డీఎస్.. గాంధీభవన్‌కు (Gandhi Bhavan) వీల్ చెయిర్‌లోనే వచ్చారు. తన కుమారుడు సంజయ్ రాజకీయ భవిష్యత్తు, తన ఎదుగుదలకు దోహదపడిన కాంగ్రెస్ లోనే చివరి వరకు కొనసాగాలన్న ఆకాంక్షతో మార్చి 26న పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. దీంతో 24 గంటల్లోనే ఏం జరిగిందో అని తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్కే నడుస్తోంది.
డీఎస్ లేఖలో ఏముంది..?
‘ఈ నెల 26న నా కుమారుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా, ఆశీస్సులు అందజేయడానికి గాంధీ భవన్‌కు వెళ్లిన నాకు కండువా కప్పి, నేను కూడా మళ్లీ పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ, ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం మనకు తెలియనిది కాదు. ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని భావిస్తే ఈ లేఖను నా రాజీనామాగా భావించి, ఆమోదించవల్సిందిగా కోరుకుంటున్నాను’ అని డీఎస్ తన లేఖలో రాసుకొచ్చారు.
డీఎస్ సతీమణి లేఖలో ఇలా..!
‘ఇగో డీఎస్ గారి రాజీనామా! ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. ఆయన్ను పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి మీ రాజకీయాలకు ఆయన్ను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నా.. ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ప్రశాంతంగా బతకనీయండి’ అని డీఎస్ సతీమణి కాస్త ఘాటుగానే లేఖ విడుదల చేశారు. లేఖతో పాటు అటు డీఎస్.. ఇటు విజయలక్ష్మి వీడియోలు కూడా రిలీజ్ చేశారు.
మొత్తానికి చూస్తే.. 24 గంటల వ్యవధిలోనే డీఎస్ కుటుంబంలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా ఆయన రాజీనామా మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కాగా.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని డీఎస్ నిర్ణయించుకున్నట్లు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రాజీనామాపై కాంగ్రెస్ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Updated Date - 2023-03-27T17:23:17+05:30 IST