Kesineni Nani: మళ్లీ ఏమైంది నాని.. ఆ ఒక్క మాటను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్..
ABN, First Publish Date - 2023-06-01T11:26:12+05:30
‘విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా నాకు అభ్యంతరం లేదు, ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తానేమో..’ అంటూ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆరు నెలల అనంతరం మళ్లీ వివాదాల్లోకి ఎంపీ కేశినేని
టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా పర్లేదని వ్యాఖ్యలు
స్వతంత్రంగా పోటీ చేస్తానని కామెంట్స్
ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలపై పొగడ్తలు
జిల్లాలో హాట్ టాపిక్‌గా ఎంపీ వ్యవహారం
పార్టీ మార్పునకు సంకేతమంటున్న టీడీపీ శ్రేణులు
‘విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా నాకు అభ్యంతరం లేదు, ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తానేమో..’ అంటూ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని (TDP Vijayawada MP Kesineni Nani) చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొన్న వైసీపీ నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు (Mondithoka Jaganmohan Rao), నేడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో (YCP MLA Vasantha Krishna Prasad) కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడే టీడీపీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేయడం వంటి పరిణామాలను టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. మరోవైపు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ కేశినేని నాని మంచి వ్యక్తి అని, ఆయన వైసీపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి): విజయవాడ పార్లమెంట్ నుంచి టీడీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందిన ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ హైకమాండ్‌పై పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆరు నెలల క్రితం అదే పనిగా పార్టీ హైకమాండ్‌పై, తన సోదరుడు కేశినేని చిన్ని, పార్టీ నేతలు దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని మధ్యలో కొంతకాలం సైలెంట్‌గా ఉండిపోయారు. తాజాగా వారం నుంచి ఆయన మళ్లీ హైకమాండ్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు.
ఇటీవల నందిగామ నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన కేశినేని నాని.. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావును ప్రశంసలతో ముంచెత్తారు. మొండితోక బ్రదర్స్ మంచి వ్యక్తులని కితాబిచ్చారు. తాను ల్యాండ్, శాండ్ మైనింగ్ కోసం బ్లాక్‌మెయిల్ చేయనని పరోక్షంగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.
ఇక బుధవారం మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆహ్వానం మేరకు ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి, రాజకీయాలు వేర్వేరని వ్యాఖ్యానించడంతో పాటు విజయవాడ లోక్‌సభ సీటు ఏ పిట్టల దొరకిచ్చినా తనకు ఇబ్బంది లేదన్నారు. ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికీ సిద్ధమేనన్నారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని, తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా భయం లేదన్నారు.
సేవా కార్యక్రమాల్లో కేశినేని చిన్ని
కేశినేని నాని సోదరుడు చిన్ని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడమే కాకుండా ఇన్‌చార్జులందరితో భేటీలు నిర్వహించు కుంటూ వస్తున్నారు. ఆరోగ్య శిబిరాలు, రక్షిత మంచినీటి సరఫరా, కిడ్నీ బాధితులకు ఆర్థికసాయం, మందుల పంపిణీ, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తాను చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నానని, టికెట్లు, పదవుల కోసం పనిచేయడం లేదని చిన్ని చెబుతు న్నారు. విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏకైక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మరో ఆరుగురు ఇన్‌చార్జులతో కేశినేని నానీకి పొసగడం లేదు.
సొంత పార్టీలో వ్యతిరేకత
కేశినేని నాని పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఇప్పటికే టీడీపీ హైకమాండ్‌కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. టీడీపీ హైకమాండ్ కూడా కేశినేని నాని వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తోంది. పైగా 2019 ఎన్నికల్లో తాను టీడీపీ సానుభూతిపరులే కాకుండా అన్ని పార్టీల వారు ఓట్లు వేస్తే గెలిచానని నాని వ్యాఖ్యలు చేయడాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. కేశినేని నాని టీడీపీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, హైకమాండ్‌ను కూడా లెక్కచేయని ధోరణిలో వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. కేశినేని నాని స్వయంకృతాపరాధం వల్లే ఆయన సోదరుడు చిన్ని నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ మారేందుకు సిద్ధమయ్యే నాని ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఓవైపు వైసీపీలో కిందిస్థాయి నాయకుడు సైతం టీడీపీ వారిపై విరుచుకుపడుతుంటే, కేసులు పెట్టి వేధిస్తుంటే, ఎంపీ స్థాయి వ్యక్తి ప్రత్యర్థి పార్టీకి భజన చేయడం ఏమిటని టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Updated Date - 2023-06-01T11:33:03+05:30 IST