BRS Khammam: ఈయనెవరో గుర్తున్నారా..? ఖమ్మం బీఆర్ఎస్ సభతో పొలిటికల్ ఎంట్రీ?
ABN, First Publish Date - 2023-01-16T16:26:11+05:30
పొలిటికల్ ఎంట్రీ కోసం తహతహలాడుతున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుకు (Telangana Health Director Srinivas) ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ అయ్యిందా? ఖమ్మంలో కేసీఆర్ (Khammam KCR Meeting) ఏర్పాటు చేసిన..
పొలిటికల్ ఎంట్రీ కోసం తహతహలాడుతున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుకు (Telangana Health Director Srinivas) ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ అయ్యిందా? ఖమ్మంలో కేసీఆర్ (Khammam KCR Meeting) ఏర్పాటు చేసిన మీటింగ్‌లోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయిన కొత్తగూడెంలో (Kothagudem) మరో ముసలం స్టార్ట్ అయినట్లేనా?
ఇప్పుడు ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. డాక్టర్‌గా తెల్లకోటు ధరించిన ఆయన ఇప్పుడు గులాబీ కండువాతో దర్శనం ఇవ్వబోతున్నట్లు ఖమ్మం బీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. నిజానికి చాలా కాలంగా డీహెచ్ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కొత్తగూడెం సీటు నుండి పోటీకి ఆరాటపడుతున్న డీహెచ్ (Director of Health).. నియోజకవర్గం కేంద్రంగా తనకంటూ బీఆర్ఎస్‌లో (BRS) ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ... ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ఆయన, ఖమ్మంలో ఈ నెల 18న ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనే పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తుండగా... డీహెచ్ కూడా తెరవెనుక తనవంతు సహయం అందిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేసిన వెంటనే ఆయన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతారని, ఇప్పటికే జలగం-వనమా గ్రూపులుగా విడిపోయిన కొత్తగూడెం బరిలో ఉంటారన్న టాక్ వినిపిస్తుంది. అధిష్టానం నుంచి సీటుపై హామీ వచ్చిందా.. కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో డీహెచ్ సీటు తెచ్చుకోగలరా.. డీహెచ్ రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారంటే సీటుపై అంత నమ్మకం ఏంటీ..? అన్న ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్‌లోనూ, లీడర్లలోనూ వినిపిస్తున్నాయి.
అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలోనూ తెలంగాణ డీహెచ్ తన స్వామి భక్తిని చాటుకున్నారు. అప్పట్లో డీహెచ్ శ్రీనివాస్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియో వైరల్ కావడం, విమర్శలు రావడం తెలిసిందే. అయితే.. ఆ సందర్భంలో విమర్శలకు స్పందిస్తూ.. కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని ఆయన సమర్థించుకోవడం కొసమెరుపు. ఒక్కసారి కాదని వందసార్లైనా బరాబర్ మొక్కుతానని కొత్తగూడెంలో జరిగిన వనమహోత్సవ వేడుకలో డీహెచ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి. అంతలా.. కేసీఆర్‌కు వినయవిధేయతలు ప్రదర్శించిన తనకే సీటు దక్కుతుందని డీహెచ్ భావిస్తున్నట్లు సమాచారం.
కరోనా మహమ్మారి ఏసుక్రీస్తు కృప వల్లే తగ్గిందని డీహెచ్ డాక్టర్ గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. మానవ జాతిని వణికించిన మహమ్మారి మనం చేసిన సేవల వల్ల తగ్గలేదని, కేవలం ఏసుక్రీస్తు కృప, దయ వల్లే తగ్గిందని ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఆ సందర్భంలో వైరల్ అయింది. ‘ఆ ఏసు క్రీస్తు కృపతోనే కరోనా తగ్గింది. ఆధునిక విద్య, వైద్య సంస్కృతిని మనదేశానికి, రాష్ట్రానికి తీసుకొచ్చింది క్రైస్తవులే. లేదంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో మనుగడ సాధించేది కాదు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందింది’ అని కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో డీహెచ్ గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆయన మాటల వీడియో వైరల్ అయింది. విమర్శలు వెల్లువెత్తడంతో గడల స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-01-16T16:26:27+05:30 IST