Nalgonda: రాజకీయాల పరంగా ఇద్దరి మధ్య గ్యాప్..నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరం..!
ABN, First Publish Date - 2023-03-30T11:57:59+05:30
నల్గొండ జిల్లా దేవరకొండ అత్యధిక గిరిజన జనాభా కలిగిన నియోజకవర్గం కావడంతో ఎస్టీకి రిజర్వ్ అయ్యింది. సీపీఐ పార్టీతో ...
సాధారణంగా ఎన్నికలకు రెండు నెలలు ఉందనగా హడావిడి మొదలవుతుంది. కానీ ఆ గిరిజన నియోజకవర్గంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికల వేడి మొదలై క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. క్యాడర్‌ను బలపరుచుకునేందుకు టికెట్ ఆశించే నాయకులు అప్పుడే కార్యక్రమాలు మొదలుపెట్టారు. వారికి ఓ సీనియర్ నేత అండగా ఉండడంతో ఆ ఎమ్మెల్యేకు పోటీగా గ్రూపు రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
సీపీఐ నుంచి 2004, 2014లో గెలుపు
నల్గొండ జిల్లా దేవరకొండ అత్యధిక గిరిజన జనాభా కలిగిన నియోజకవర్గం కావడంతో ఎస్టీకి రిజర్వ్ అయ్యింది. సీపీఐ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రవీంద్ర కుమార్ 2004, 2014లోఎమ్మెల్యేగా గెలుపొందారు. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా 2018 ఎన్నికల ముందు రవీంద్ర కుమార్ సిపిఐ పార్టీని వదిలి గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా గత ఏడాది నుంచి కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధికారిక కార్యక్రమాలకు మినహా మిగత కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో కొన్నాళ్లుగా నియోజకవర్గ నాయకులు, ప్రజలతో గ్యాప్ ఏర్పడింది. ఇటీవల ఆ గ్యాప్ సరిదిద్దుకునే కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
రాజకీయాల పరంగా ఇద్దరి మధ్య గ్యాప్
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి దేవరకొండ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో గుత్తా సహకారంతోనే రవీంద్ర కుమార్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే కొంత కాలంగా నియోజకవర్గ రాజకీయాల పరంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కి మధ్య గ్యాప్ ఏర్పడిందట. అప్పటి నుంచి నియోజకవర్గంలోని గుత్తాకు చెందిన వర్గం పట్ల అంటీ ముట్టనట్టుగా ఎమ్మెల్యే వ్యవహరించడంతో గుత్తాకి, ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ మరింతగా పెరుగుతూపోతోందట.
ఎమ్మెల్యే వర్గం నాయకులతో విహారయాత్రకు ప్లాన్
ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి తన క్యాడర్‌ను బలపరుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తరపున మరో ఎమ్మెల్యే అభ్యర్థిని రెడీ చేసేలా సంకేతాలు ఇచ్చేశారు. దీంతో గుత్తా అనుచరుడిగా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్‌తో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌పై అసంతృప్తితో ఉన్న సొంత క్యాడర్‌లోని నాయకులను మచ్చిక చేసుకునేందుకు గుత్తా వర్గం పావులు కదుపుతోంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన ముఖ్య నాయకులను మచ్చిక చేసుకొని గుత్తా వర్గం విహారయాత్రకు ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, ఎంపీపీ, పలు మండలాల్లోని ముఖ్య నేతలు గుత్తా వర్గానికి చెందిన దేవరకొండ మున్సిపల్ చైర్మన్, ఇతర నేతలతో కలిసి టూర్ వెళ్లారు.
నిన్నటిదాకా ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు గుత్తా వర్గంతో కలిసి తిరగడంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కేవలం తన సొంత క్యాడర్‌లో కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం, మండల స్థాయి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కారణాలతో ఆ నాయకులు దూరమవుతున్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజాదరణ ఉన్నా.. వ్యతిరేకత కూడగట్టుకోవడం.. తన సొంత క్యాడర్ నాయకులు దూరం అవుతుండడం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కు తలనొప్పిగా మారిందట. మరి వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితులు చక్కబడుతాయా.. లేదంటే గ్రూపు రాజకీయాలు ఇంకా తారా స్థాయికి చేరుతాయో చూడాల్సి ఉంది.
Updated Date - 2023-03-30T11:57:59+05:30 IST