Guntur: గుంటూరు జిల్లాలో ఇప్పటికి ఉన్న పరిస్థితి ఇది.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..
ABN, First Publish Date - 2023-05-09T16:58:22+05:30
వైసీపీ పెద్దలకు గుంటూరు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితులు వణుకు పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రతి నియోజకవర్గంలోనూ..
గుంటూరు జిల్లాలో వైసీపీకి గుబులు
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎదురీతే
ఇప్పటికే పార్టీకి దూరమైన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి
పొన్నూరులో రోడ్డున పడిన పార్టీ ప్రతిష్ట
తాను గెలవలేనని కుమార్తెను రంగంలోకి దింపిన ఎమ్మెల్యే ముస్తఫా
అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి సుచరిత
మంగళగిరిలో ఆళ్ల తిరుగుబాటు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): వైసీపీ (YCP) పెద్దలకు గుంటూరు జిల్లాలో (Guntur District) ఆ పార్టీ పరిస్థితులు వణుకు పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రతి నియోజకవర్గంలోనూ నానాటికి గెలుపు అవకాశాలు దిగజారుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత గుంటూరు జిల్లా పరిధిలోకి ఏడు నియోజకవర్గాలొచ్చాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గా లేదు. ఈ విషయాన్ని వైసీపీ ముఖ్య నేతలు తమ అంతర్గత సమావేశాల్లో కూడా చర్చించుకుంటూ ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ధిక్కరించారనే అపవాదుతో ఎమ్మెల్యే శ్రీదేవిని పార్టీ నుంచి తప్పించారు. అలానే పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుగుతోంది. సొంత పార్టీ శ్రేణుల్లోనే కుమ్ములాటలు సాగుతోన్నాయి.
ఇక ఎమ్మెల్యే రోశయ్యపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కొందరు ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను అకారణంగా సస్పెండ్ చేయించటంతో ఆ వర్గం ఎమ్మెల్యే రోశయ్యపై గుర్రుగా ఉంది. మరో వైపు రాజధానిని విదాస్పదం చేసేలా నిత్యం న్యాయస్థానాల్లో సవాల్ చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న గడపగడప కార్యక్రమానికి ఆయన దూరంగా ఉంటున్నారు. ఏం అభివృద్ధి చేశామని, వెళ్తామంటూ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. దాంతో మంగళగిరిలో పార్టీ పరిస్థితి గందరగోళ స్థితిలోకి వెళ్ళింది.
ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వ్యవహారశైలితో పార్టీ శ్రేణులు అగమ్యగోచరంలో పడ్డాయి. తొలినాళ్ళలో పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఇప్పుడు సద్దుమణిగినా కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమంలోనూ ఆమె వెనుకపడ్డారు. మంత్రి వర్గం నుంచి తనను తప్పించటం, అనంతరం ఇచ్చిన జిల్లా అధ్యక్ష పదవిని చెప్పకుండానే లాక్కోవటం వంటి పరిణామాలతో ఆమె లోలోపల రగిలిపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తెనాలి నియోజకవర్గంలో కూడా పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అంతర్గతంగా కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొన్నది. పార్టీలో అంతర్గత విభేదాలు ఉత్పన్నమైనప్పుడు ఎమ్మెల్యే శివకుమార్ ఒక సామాజికవర్గాన్ని వెనుకేసుకురావటంతో ఇతర సామాజికవర్గాలు దూరమయ్యాయి. నిన్నమొన్నటి వరకు నియోజకవర్గంలో ఓ రౌడీషీటర్‌కు పెత్తనం ఇవ్వటంతో పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.
ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా రెండు దఫాలు విజయం సాధించిన ముస్తఫాకు ఈసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు ఓటమి భయమో, లేక సెంటిమెంటుతోనే తన కుమార్తెను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించుతున్నట్లు ఎమ్మెల్యే ముస్తఫా ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు. అయితే నేటికీ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తెకు సీటుపై అధిష్ఠానం నుంచి స్పష్టత లేకపోవటంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది. వైసీపీ ప్రభంజనంలా సాగిన 2019 ఎన్నికల్లోనూ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మద్దాలి గిరిధర్ విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతర పరిణామాల నేపథ్యంలో గిరిధర్ వైసీపీ గూటికి చేరారు. అధికారికంగా ఆయన టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అంతేగాక పశ్చిమ నియోజకవర్గంలో మొన్నటి వరకు ఇన్‌ఛార్జ్‌గా చంద్రగిరి ఏసురత్నం, కాగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కార్యాలయం ఉండటంతో ఇక్కడ కూడా పార్టీ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల స్థితి అగమ్యగోచరంగా మారింది.
కాగా.. గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యలు విజయం సాధించినా వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. అటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ గుంటూరు ఎంపీ సీటును ఆశించే వారే కనిపించటం లేదు. గత ఎన్నికల్లో ఓడిన ఎంపీ అభ్యర్థి మోదుగుల మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు.
Updated Date - 2023-05-09T16:58:25+05:30 IST