KCR Kondagattu visit: సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందిన పాత ఫొటోలు వైరల్... ఇవి ఎప్పుడు దిగారో తెలుసా..
ABN, First Publish Date - 2023-02-15T21:33:33+05:30
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) కొండగట్టు అంజన్నను (Kondagattu Anjanna) దర్శించుకోవడం తెలంగాణ ప్రజానీకంలో ఆసక్తిని రేకెత్తించింది. అనుకున్నట్టే..
కొండగట్టు: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) కొండగట్టు అంజన్నను (Kondagattu Anjanna) దర్శించుకోవడం తెలంగాణ ప్రజానీకంలో ఆసక్తిని రేకెత్తించింది. సీఎం హోదాలో అక్కడికి తొలి పర్యటన కావడంతో వరాలు ఖాయమని భావించినట్టే... అంజన్న క్షేత్ర అభివృద్ధికి ఇదివరకే ప్రకటించిన రూ.100 కోట్లకు అదనంగా మరో రూ.500 కోట్లు ప్రకటించి అబ్బురపరిచారు కేసీఆర్. తద్వారా ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు మరోసారి చాటుకున్నారు. అయితే సీఎం హోదాలో కేసీఆర్ కొండగట్టు సందర్శన విశేషాలు ఈ విధంగా ఉంటే.. దాదాపు 25 ఏళ్లక్రితం సాధారణ వ్యక్తిగా, కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ కొండగట్టు సందర్శించిన నాటి పాత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పాత ఫొటోల్లో కేసీఆర్‌తోపాటు ఆయన సతీమణ శోభారాణి, కుటుంబ సభ్యులు ఉన్నారు. అంతేకాదు చిన్నపిల్లలుగా ఉన్న కేటీఆర్, కవిత కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు. ఎంపీ సంతోష్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు దాదాపు 25 ఏళ్లనాటివి. ‘‘ విశిష్టమైన పురాణ ప్రాంతాల సంపూర్ణ అభివృద్ధిలో ఇప్పుడు కొండగట్టు వంతొచ్చింది. కొండగట్టులోని ‘వ్యూ పాయింట్’ (view point) ప్రాంతంలో పాత జ్ఞాపకాలు ఇవి. గౌరవనీయులు సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నోసార్లు అంజన్నను దర్శించుకున్నాం. అప్పుడు దిగిన ఫొటోలు ఇవి’’ అని ఎంపీ సంతోష్ ట్వీటర్‌లో రాసుకొచ్చారు. కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఈ ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి. నిజానికి తెలంగాణ ఉద్యమం, రాజకీయజీవితంలో కేసీఆర్ ఎన్నోసార్లు జగిత్యాల వెళ్లినప్పటికీ కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కాగా ఎంపీ సంతోష్ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సమీప బంధువనే విషయం తెలిసిందే. అందుకే పాత ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటారు.
కొండగట్టుకు మరో రూ.500 కోట్లు..
కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంజన్నను బుధవారం దర్శించుకున్నారు. హెలికాప్టర్‌లో వెళ్లిన ఆయన తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. బస్సు ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. పండితులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించి దాదాపు రెండు గంటలకు పైగా కేసీఆర్ సమీక్ష జరిపారు. ఇటివల ప్రకటించిన రూ.100కోట్లకు అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
Updated Date - 2023-02-15T21:53:15+05:30 IST