Woman: నేను బతికే ఉన్నాను బాబోయ్.. కాస్త గుర్తించండి.. ఓ మహిళకు వింత కష్టం.. 16 ఏళ్లుగా ఇదే నిజాన్ని చెబుతున్నా..!
ABN, First Publish Date - 2023-09-28T18:46:34+05:30
బతికున్న వారిని.. రికార్డుల్లో చంపేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే కొందరు ఈ సమస్య కారణంగా చాలా నష్టపోతుంటారు. ఇంకొందరు వృద్ధులు తాము బతికున్నామని నిరూపించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగుతుంటారు. ఇలాంటి...
బతికున్న వారిని.. రికార్డుల్లో చంపేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే కొందరు ఈ సమస్య కారణంగా చాలా నష్టపోతుంటారు. ఇంకొందరు వృద్ధులు తాము బతికున్నామని నిరూపించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగుతుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ.. ఇదే సమస్యతో 16ఏళ్లుగా పోరాటం చేస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అమెరికాలోని (America) మిస్సౌరి సెయింట్ లూయిస్ ప్రాంతానికి చెందిన మిచెల్ కార్థెన్‌కు వింత సమస్య వచ్చి పడింది. 2007లో వెబ్‌స్టర్ యూనివర్శిటీలో కార్థెన్ చదువుకునే రోజుల్లో షాకింగ్ న్యూస్ తెలిసింది. ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో ఆమె చనిపోయినట్లుగా నమోదైంది. అప్పట్లో ఈ విషయం తెలియగానే మొదట కార్థెన్ నవ్వుకుంది. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది.. వాళ్లే సరిచేస్తారని లైట్ తీసుకుంది. అయితే అదే తన జీవితంలో అతి పెద్ద సమస్యగా మారుతుందని ఊహించలేకపోయింది. రికార్డుల్లో చనిపోయినట్లుగా నమోదవడంతో యూనివర్శిటీలో (University) గ్రాడ్యుయేట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆమెకు సంబంధించిన సోషల్ సెక్యూరిటీ నంబర్‌ను (SSN) కూడా తొలగించారు.
అప్పటి నుంచి ఆమె ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల ప్రయోజనాలు పొందేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే ఆమెకు సంబంధించిన వాహనాలు తదితరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తాను ‘‘బతికే ఉన్నా మహాప్రభో’’.. అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అయినా ఆమెకు మాత్రం న్యాయం జరగలేదు. సోషల్ సెక్యూరిటీ నంబర్లను పర్యవేక్షించే SSA (Social Security Administration) అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె ఐఆర్ఎస్ (Internal Revenue Service) డిపార్ట్‌మెంట్ సహా పలు శాఖల అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం 52 వయసున్న కార్థెన్.. ఈ 16 ఏళ్లలో ఉద్యోగాలు లేక, కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా ఎన్నో కష్టాలను అనుభవించింది.
దీంతో విసిగిపోయిన కార్థెన్ 2019లో SSA, ఇతర ప్రభుత్వ సంస్థలపై ఫెడరల్ దావా వేసింది. అయితే అక్కడి ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండడంతో ఈ దావా కొట్టివేయబడింది. ఇలావుండగా, 2021లో ఊహించని విధంగా SSA అధికారులు ఆమెకు సోషల్ సెక్యూరిటీ నంబర్ జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే అదే ఏడాది కార్థెన్ తన పేరును చట్టబద్ధంగా మాడెలైన్ కోబర్న్ అని మార్చుకుంది. తన కొత్త సెక్యూరిటీ నంబర్.. ఇప్పటికీ పాత నంబర్‌కు కనెక్ట్ అయి ఉండడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కార్థెన్ మాట్లాడుతూ.. తన సమస్య పరిష్కారం అయ్యే వరకూ పోరాటం సాగిస్తానని చెబుతోంది. ఇది తన కోసం కాకపోయినా తనలాగే ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఊపయోగకరంగా ఉంటుందని తెలిపింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-09-28T18:50:59+05:30 IST