Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!
ABN , First Publish Date - 2023-11-26T18:49:29+05:30 IST
ఓ మహిళకు మతిమరుపు కారణంగా ఊహించని చిక్కుల్లో పడింది. విమానశ్రయంలో ఏకంగా రూ.1.6 లక్షల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణంలో తిందామని ఓ మహిళ ఎయిర్‌పోర్టులో చికెన్ శాండ్‌విచ్ కొనుక్కుంది. దాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని విమానం ఎక్కేసింది. కానీ మార్గమధ్యంలో ఆమె ఓ చిన్న కునుకు తీసింది. మెళకువ వచ్చాక ఆమెకు శాండ్‌విచ్(Sandwich) విషయమే గుర్తులేకుండా పోయింది. అదే ఆమెకు ఊహించిన సమస్య తెచ్చిపెట్టింది. చివరకు రూ.1.6 లక్షల మేర జేబుకు చిల్లుపడేలా చేసింది. న్యూజిలాండ్(Newzealand) నుంచి ఆస్ట్రేలియాకు(Australia) వెళ్లిన ఓ మహిళ ఎదుర్కొన్న విచిత్ర పరిస్తితి ఇది.
Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!
విమానాశ్రయాల్ని సాంకేతికత పరిభాషలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. అంటే ఓ దేశానికి ప్రవేశద్వారాలన్న మాట. ప్రయాణికులు వాటిని దాటి దేశంలో కాలుపెట్టాలంటే ఎన్నో నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా వేటిని తమ వెంట తెచ్చుకోవచ్చు, ఏవి తెచ్చుకోకూడదు అనే విషయంపై పూర్తి అవగాహన ఉండాలి. ఆహార పదార్థాలు, పళ్లు, ఇతర విషయాల్లో విమానాశ్రయాలు నిక్కచ్చిగా వ్యవహరిస్తాయి. కానీ ఈ విషయాల్ని సదరు మహిళ పట్టించుకోక చిక్కుల్లో పడింది(Australian Customs Fines Woman Rs 1.6 Lakh For Undeclared Chicken Sandwich).
Viral: వామ్మో ఇంత దూకుడా.. ఇలాగైతే చైనాను ఆపడం కష్టమే..!
ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం, విదేశీ ప్రయాణికులు తమ వద్ద ఏయే వస్తువులు ఉన్నాయో ముందుగా చెబుతూ ఓ డిక్లరేషన్ ఫాం నింపి ఎయిర్‌పోర్టు అధికారులకు ఇవ్వాలి. చెకింగ్ సమయంలో కస్టమ్స్ అధికారుల ప్రయాణికుల వద్ద ఉన్న వస్తువులను డిక్లరేషన్ ఫాంలో ఉన్న వాటితో పోల్చి చూస్తారు. తేడా వస్తే భారీ జరిమానా విధిస్తారు. బాధిత మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
చెకింగ్ సందర్భంగా అధికారులకు మహిళ బ్యాగులోని శాండ్‌విచ్ కనిపించింది. దీంతో, షాకైపోయిన మహిళ..శాండ్‌విచ్ విషయం మర్చిపోయానని చెప్పింది. ఈ క్రమంలో అధికారులు ఆమెకు నిబంధనలు వివరించారు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న వస్తువులు ఏవో పూర్తిగా వెల్లడించకపోతే భారీ జరిమానా తప్పదంటూ ఆమెపై రూ.1.6 లక్షల (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) ఫైన్ వేశారు. మరో మార్గం లేక మహిళ ఆ మొత్తాన్ని చెల్లించి నెత్తిబాదుకుంది.