Insta reel: ఇన్‌స్టా రీల్ చిత్రిస్తుండగా ఘోరం జరిగింది.. ఇలా ఎవరూ చేయకండి..
ABN, First Publish Date - 2023-03-18T18:38:32+05:30
ఇన్‌స్టా రీల్స్ (Insta reels) ప్రస్తుతం ఒక ట్రెండ్. ఔత్సాహికులు తమ టాలెంట్ చూపించేందుకు రీల్స్‌ను ఉపయోగించుకుంటున్నారు.
బిలాస్‌పూర్ : ఇన్‌స్టా రీల్స్ (Insta reels) ప్రస్తుతం ఒక ట్రెండ్. ఔత్సాహికులు తమ టాలెంట్ చూపించేందుకు రీల్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. మంచి వీడియోలు చేసి ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు. ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుని సెలబ్రిటీగా మారిపోవాలని చూస్తున్నారు. కొందరు పాపులారిటీ కోసం వినూత్న వీడియోల కోసం ప్రయత్నించి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ప్రాణాల మీదకు తెచ్చిన పలు ఘటనలు కూడా ఉన్నాయి. ఇదే తరహాలో తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఇన్‌స్టా రీల్ కోసం ప్రయత్నించిన ఓ యువకుడు ప్రాణం కోల్పోయిన విషాదకర ఘటన ఛతీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇరవై ఏళ్ల ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఇన్‌స్టా రీల్ (Insta reel) చేయాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఛతీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్ గవర్నమెంట్ సైన్స్ కాలేజీలో బీఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆశ్‌తోశ్ సావ్ అనే ఓ విద్యార్థికి ఇన్‌స్టా రీల్ చిత్రీకరణ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయాడు. తన స్నేహితులతో కలిసి కాలేజీ భవనంపై ఇన్‌స్టా రీల్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. తలకు తీవ్రమైన గాయమవ్వంతో అక్కడికక్కడే చనిపోయాడు. యువకుడు కిందపడిన ఈ దృశ్యం స్నేహితుల సెల్‌ఫోన్‌లో రికార్డయ్యింది. మొదటి అంతస్థుపై నుంచి పడ్డాడని, ఐదుగురు స్నేహితులు రీల్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు.
విద్యార్థి ఆశ్‌తోశ్ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి కిటికీ స్లాబ్‌ను పట్టుకోవాలనేది ప్లాన్. ఈ దృశ్యాలను ఇన్‌స్టా రీల్‌గా పోస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఊహించని విషాదం ఎదురైంది. విద్యార్థి ఆశ్‌తోశ్ ప్రమాదవశాత్తూ బిల్డింగ్ మీద నుంచి కిందపడిపోయాడని, తలకు తీవ్రమైన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా విద్యార్థి ఆశ్‌తోశ్ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను బిలాస్‌పూర్ ఎస్పీ సంతోష్ సింగ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. యువత ఇలాంటి రిస్కీ స్టంట్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
Updated Date - 2023-03-18T18:48:40+05:30 IST