నువ్వేమీ సాధించలేవని ఫ్రెండ్స్ హేళన చేశారు.. అందరి నోళ్ళు ఎలా మూయించిందంటే..
ABN , First Publish Date - 2023-02-27T13:40:38+05:30 IST
నీకేమీ చేతకాదు నువ్వేమీ సాధించలేవని ఎవరైనా అన్నప్పుడు చాలా కోపం వస్తుంది.
నీకేమీ చేతకాదు నువ్వేమీ సాధించలేవని ఎవరైనా అన్నప్పుడు చాలా కోపం వస్తుంది. కొందరు ఆ మాటలు గుర్తుపెట్టుకుని కసితో ఎదుగుతారు, తామేంటో నిరూపించుకుంటారు. మరికొందరు అన్నవారితో గొడవకు దిగి మనసులో ఆవేదన అంతా తిట్ల రూపంలో వెళ్ళగక్కుతారు. నా జీవితంతో వాళ్ళకేం పని అని వాదిస్తారు. తరువాత మామూలయిపోతారు. నేహా మొదటి కోవకు చెందిన మహిళ. ఆమెకు తోడు ఆమె భర్త ఉండటమే ఆమె బలం. మంచి వ్యాపారవేత్తలను పెళ్ళిచేసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ పెళ్ళయ్యాక భర్తను నడిపిస్తూ తనూ సక్సెస్ గడప తొక్కిన నేహా గురించి తెలుసుకుంటే..
రాజస్తాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్(Jaipur) లో ట్రామ్పోలిన్ పార్క్(Trampoline Park) ఉంది. బోలెడు ఇండోర్ గేమ్స్ తో అక్కడికి వచ్చే వారికి చెప్పలేనంత ఫన్ పంచుతోంది ఈ పార్క్. దీని పేరు పునో(Puno). గూగుల్ లో ట్పామ్పోలిన్ పార్క్ ఇన్ జైపూర్ (Trampoline park in jaipur)అని సెర్చ్ చేస్తే పునో పార్క్ పేరు చూపిస్తోంది. ఒకప్పుడు తన స్నేహితులు నువ్వేమీ చెయ్యలేవని నేహాను వెక్కిరించారు. అయితే వెక్కిరించిన వారి నోర్లు వంకరపోయేలా 12కోట్ల కంపెనీనీ ఈ రోజు తన చేతుల్లో పెట్టుకుంది నేహా. నేహా అగర్వాల్, పంకజ్ అగర్వాల్ కు 2005లో పెళ్ళయ్యింది. పెళ్ళి తరువాత వీరిద్దరూ కలసి వెడ్డింగ్ ప్లానింగ్ ప్రాజెక్ట్(edding Planning Projects) లు చేయడం మొదలుపెట్టారు. వారికి ఈ బిజినెస్ కలసిరాలేదు. చాలామంది క్లైంట్ లు డబ్బు ఎగ్గొట్టేవారు, కొందరు డబ్బు తొందరగా ఇచ్చేవారు కాదు. అందరి దగ్గరా డబ్బు వసూలుచేసుకోవడం వారికి పెద్ద టాస్క్ అయింది. దాంతో అది వదిలేసి పటాసుల వ్యాపారం వైపు వెళ్ళారు. పంకజ్ కుటుంబం పటాసుల తయారీ వ్యాపారంలో ఉండటంతో వారికి అది కష్టం అనిపించలేదు. కానీ ఈ వ్యాపారం కుప్పకూలింది. దాని తరువాత ఏం చేయాలనే ఆలోచనలో మునిగిపోయారు. వీరిద్దరూ తరచుగా ఫారిన్ ట్రిప్స్ కు వెళుతుంటారు. అక్కడి వారు వారాంత సమయాల్లో పని నుండి రిలాక్స్ కావడానికి ట్రామ్పోలిన్ పార్క్ లకు వెళతారు. అది ఎంతో ఎంజాయ్మెంట్ ను ఇస్తుంది. అలాంటిది వారు ఇండియాలో పెట్టాలని అనుకున్నారు. కానీ అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆలోచనలో పడిపోయారు.
Read alsp: కూతురికోసం తల్లి సాహసం.. అరగంట సేపు అడవిపందితో పోరాడిమరీ బిడ్డను కాపాడుకుంది.. కానీ చివరికి..
జైపూర్ పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడికి కేవలం స్థానికులే కాకుండా టూరిస్ట్ లు కూడా ఆసక్తిగా వస్తారని అనిపించింది. స్నేహితులు, బంధువులు, తెలిసినవారి ద్వారా 5కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ డబ్బుతో జైపూర్ లో పునో అనే పేరుతో ట్రామ్పోలిన్ పార్క్ ను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు అందరికీ వారి వయసుకు తగిన యాక్టివిటీస్ ఈ పార్క్ లో ఉన్నాయి. ఇక్కడ ముసలివారు కూడా చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చేస్తున్నప్పుడు తన కొడుకుకు కేవలం నెలల వయసట. అంత పసివాడికి సమయం కూడా వెచ్చించలేక ఎంతో బాధపడ్డానని నేహా చెప్పింది. ఇప్పుడు జైపూర్ లో ఉన్న ట్రామ్పోలిన్ పార్క్ కు నేహా కొడుకే పేరు సూచించాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
ఈ ట్రామ్పోలిన్ పార్క్ కోసం తాము ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇప్పించినట్టు ఈ జంట తెలిపింది. జైపూర్ చుట్టుప్రక్కల అజ్మీర్, జోధ్ పుర్, అల్వార్, కోట ఇలా చుట్టూ ఉన్న జిల్లాల నుండి కూడా వీకెండ్ లో ఇక్కడికి ఎంజాయ్ చెయ్యడానికి వస్తున్నట్టు నేహా చెప్పింది. నెలకు కోటి రూపాయలతో సంవత్సరానికి 12కోట్ల టర్నోవర్ తో వీరి ట్రామ్పోలిన్ పార్క్ సక్సెస్ బాటలో సాగుతోంది. ప్రమాదానికి దూరంగా సాహసాలు చెయ్యడం, థ్రిల్ ఫీలవ్వడం, తాడుతో పైకి ఎక్కేయడం, మారథాన్ టాస్క్ లు చేయడం ఇలా ఒకటా రెండా బోలెడు ఉన్నాయి ఈ ట్రామ్పోలిన్ పార్క్ లో.. వినోదంతో పాటు వ్యాపారం కూడా ఊపు మీద ఉండటంతో ఈ ఏడాది మరొక మూడు నగరాల్లో ట్రామ్పోలిన్ పార్క్ ఏర్పాటుకు సన్నద్దమవుతున్నారు నేహా, పంకజ్ జంట.