వాయిస్‌ను మార్చే యాప్‌తో కుర్రాళ్లకు ఎర.. ఇంట్లో కూర్చుని అమ్మాయిలా ఫోన్ మాట్లాడి ఎంత డబ్బు కూడబెట్టాడో తెలిసి పోలీసులే..!
ABN, First Publish Date - 2023-03-05T13:11:29+05:30
నువ్వు నాకు దొరకడం నా అదృష్టమని అతను ఎన్ని సార్లు అనుకున్నాడో కానీ..
'నువ్వెంత మంచివాడివో.. చాలా మంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసి వదిలేస్తుంటారు. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు. యు ఆర్ సో గుడ్.. లవ్యూ సో మచ్..' అని తియ్యగా ఆమె మాట్లాడేసరికి అతనికి గర్వంగా అనిపించింది. 'లవ్ యూ టూ సో మచ్. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. అన్నట్టు మరిచిపోయాను.. నువ్వు ఏదో అవసరానికి డబ్బు లేదన్నావు కదా నేను ఫోన్ పే లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడు' అని డబ్బు పంపాడు అతను. అలా ఒకటి రెండు కాదు ఏకంగా 5లక్షలకు పైనే ఆమెకు పంపాడు. కానీ తను డబ్బు పంపుతున్నది అమ్మాయికి కాదనే విషయం తెలిసి అతను షాకయ్యాడు.పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు బయటపడింది. ఓ కుర్రాడు వాయిస్ యాప్ తో మాయ చేసి కుర్రాళ్ళ దగ్గర ఎంత డబ్బు లాగాడో తెలిసి పోలీసులు కూడా కళ్ళు తేలేశారు. చత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
చత్తీస్ గడ్(Chhattisgarh) రాష్ట్రంలో రాయ్ గఢ్(Raigarh) జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో(Government School) విద్యాచరణ్ అనే వ్యక్తి పీటీఐ(PTI) గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2021 నవంబర్ నెలలో సవిత అనే అమ్మాయి నుండి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్(Face Book Friend Request) వచ్చింది. అతను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తరువాత మెసేంజర్ లో చాటింగ్(Messanger Chatting) మొదలైంది. సవిత తను కూడా టీచర్ గా పనిచేస్తున్నట్టు విద్యాచరణ్ తో చెప్పింది. వారిద్దరి ఫేస్ బుక్ స్నేహం కాస్తా చనువు పెరిగింది. మెసేంజర్ నుండి వాట్సాప్(Whatsapp) కు ఫోన్ కాల్స్(Phone Calls) కు మారింది వారి సంభాషణ. సవిత ఎంతో గమ్మత్తుగా మాట్లాడేది, ఆ మాటలకు విద్యాచరణ్ ఫ్లాటయ్యాడు, సవితకు ప్రపోజ్ చేశాడు. సవిత కూడా విద్యాచరణ్ ప్రేమను యాక్సెప్ట్ చేసింది. ఆమెకు అవసరమైనప్పుడల్లా విద్యాచరణ్ దగ్గర డబ్బు తీసుకునేది. అలా 15నెలల్లో దాదాపు 5లక్షలా 20వేల రూపాయలు విద్యాచరణ్ నుండి ఆమె ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యాయి.
ఈ క్రమంలో సవిత నేరుగా కలుద్దామని విద్యాచరణ్ కు చెప్పింది. విద్యాచరణ్ కూడా తను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని చూడటానికి చాలా ఎగ్జైట్ అయ్యాడు . కానీ అతను సవిత కోసం ఎదురు చూస్తుంటే అతని దగ్గరకు ఓ కుర్రాడు వచ్చాడు. విద్యాచరణ్ ముందే ఆ కుర్రాడు అమ్మాయిలా ఫోన్ లో మాట్లాడేసరికి విద్యాచరణ్ కు పెద్ద షాక్ తగిలింది. తాను అన్నిరోజులు మాట్లాడింది సవిత అనే అమ్మాయితో కాదని అమ్మాయిలా మాట్లాడుతున్న అబ్బాయితో అని అర్థం చేసుకున్నాడు.అతని కాళ్ళకింద భూమి కంపించినట్టయ్యింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన మోసం గురించి చెప్పాడు. పోలీసులు సదరు కుర్రాడిని అరెస్ట్ చేసి ఆరా తీయగా వాయిస్ యాప్ సహాయంతో అతను అమ్మాయిలా విద్యాచరణ్ తో మాట్లాడినట్టు తెలిసింది. కేవలం విద్యాచరణ్ తోనే కాకుండా చాలామందితో అలా మాట్లాడి, కొందరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు దోచుకున్నట్టు తెలిసింది. పోలీసులు సదరు కుర్రాడిపై సెక్షన్ 420(Section 420), ఐటీ యాక్ట్(IT Act) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది.
Updated Date - 2023-03-05T13:11:29+05:30 IST