Minister: ఆయన తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు మంత్రికూడా.. కానీ కార్యాలయం మాత్రం..
ABN, First Publish Date - 2023-05-10T10:26:56+05:30
ఆయన ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కానీ...
వేలూరు(చెన్నై): ఆయన డీఎంకేలో కీలక మంత్రి, సీనియర్ నేత. డీఎంకే తరఫున ఏకంగా తొమ్మిదిమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రజలను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు నిర్మించుకున్న ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం మూతబడే వుంటోంది. ఆయనే రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దురైమురుగన్(Minister Durai Murugan). కాట్పాడి శాసనసభ నియోజకవర్గం నుంచి తొమ్మిదిమార్లు విజయఢంకా మోగించిన సీనియర్ నేత ఆయన. కాట్పాడిలోని గాంధీనగర్‌లో ఆయనకు నివాసముంది. అయితే ప్రజలను కలుసుకునేందుకు అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితం ఆయన రూ. 5లక్షలతో ప్రత్యేకంగా కార్యాలయం నిర్మించుకున్నారు. అయితే కొద్దిరోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్న ఆ కార్యాలయం ఆ తరువాత మళ్లీ తెరుచుకోలేదు. అప్పుడప్పుడు దురైమురుగన్ సహాయకులు వచ్చి వెళ్తుంటారు. ఇలా వృథాగా ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం గురించి ఆయన అనుచరులు మాట్లాడుతూ... కాట్పాడి నియోజకవర్గ(Katpadi Constituency) ప్రజలకు ఎలాంటి సమస్యల్లేవని, అందుకే ఆయన ప్రజలను కలుసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దీని గురించి వేలూరు నగర అన్నాడీఎంకే కార్యదర్శి అప్పుడు మాట్లాడుతూ... కాట్పాడి నియోజకవర్గంలోని పలుచోట్ల సరైన రోడ్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని వాటి గురించి చెప్పేందుకు ఎమ్మెల్యేను కలుసుకోవాలన్నా అవకాశం దొరకడం లేదని విమర్శించారు.
Updated Date - 2023-05-10T10:26:56+05:30 IST