ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

K Viswanath: సంగీతం, సాహిత్యం.. అంతటా ఆయనే!

ABN, First Publish Date - 2023-02-03T19:04:32+05:30

తెలుగు సినిమా చరిత్రలో అతి గొప్పవిగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, సంగీతం అన్నీ విశ్వనాథ్‌ సినిమాల్లోనే కనిపిస్తాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘కథకుడు కథను రూపొందిస్తాడు. సంభాషణల రచయిత సంభాషణలు రాస్తాడు. పాటల రచయిత పాటలు అల్లుతాడు. డాన్స్ డైరెక్టర్‌ నృత్య రీతులు సమకూరుస్తాడు. మేకప్‌ ఆర్టిస్టు మేకప్‌ చేస్తాడు. ఇవన్నీ అయ్యాక దర్శకుడు దర్శకత్వం మాత్రమే చేస్తాడు’’ అని చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవంగా సినిమాకు సంబంధించిన ఈ అన్ని విభాగాల్లో దర్శకుడి పాత్ర చాలా ఉంటుంది. అందులో కె.విశ్వనాథ్‌ వంటి దిగ్దర్శకుడి పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో అతి గొప్పవిగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, సంగీతం అన్నీ విశ్వనాథ్‌ సినిమాల్లోనే కనిపిస్తాయి. అదే రచయితలు, సంగీత దర్శకులు వేరే వారి సినిమాల్లో అంత గొప్పగా రాయలేరు. సంగీతం చేయలేరు. ప్రతి కళాకారుడూ తన అత్యుత్తమ ప్రతిభను చూపించే అవకాశం విశ్వనాథ్‌ సినిమాల్లోనే దొరుకుతుంది. ఇలా జరగాలంటే ఆ దర్శకుడికి అన్ని రంగాల్లో ప్రవేశం, ఒకింత ప్రతిభ ఉండాలి. ఆయా రచయితలకు, సంగీత దర్శకులకు తనకు ఏం కావాలో స్పష్టంగా, హృద్యంగా చెప్పగల నేర్పు ఉండాలి. తనకు కావాల్సింది వచ్చేదాకా వదిలిపెట్టనంత పట్టుదల, ఓర్పు ఉండాలి. అవన్నీ విశ్వనాథ్‌లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఆయన సినిమాలు కావ్యాలై చరిత్రలో నిల్చిపోయాయి. దర్శకుడైన విశ్వనాథ్‌ ఇతర రంగాల్లో చూపిన ప్రతిభకు ఉదాహరణలు మచ్చుకు కొన్ని...

స్క్రీన్ ప్లే, ఎడిటింగ్‌:

తాగుబోతు అని తిట్టి... తానే తాగుబోతై...

సాగర సంగమం చిత్రం ప్రథమార్ధం మొత్తం వర్తమానం... ఫ్లాష్‌ బ్యాక్‌... వర్తమానం... మళ్లీ ఫ్లాష్‌ బ్యాక్‌ పద్ధతిలో సాగుతుంది. ఫ్లాష్‌ బ్యాక్‌లో కమల్‌ హాసన్ గొప్ప డాన్సర్‌. నాట్యాన్ని ఓ కళగా చూస్తాడే తప్ప దాని ద్వారా డబ్బు సంపాదించాలని అనుకోడు. కమల్‌ స్నేహితుడు శరతబాబు అతన్ని బలవంతంగా ఓ సినిమా డాన్స్ డైరెక్టర్‌ (మిశ్రో) దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ డాన్స్ డైరెక్టర్‌ గ్లాసులో మందు పోసుకుని తాగుతూ ఓ మంచి పాటకు కమల్‌ హాసన్‌తో అసభ్యమైన స్టెప్పులు వేయిస్తాడు. దానితో కమల్‌ హాసన్ తాను మహా పాపం చేసినట్టు భావించి రోడ్డు మీద ఉన్న వినాయకుడి విగ్రహం ముందు నిలబడి ప్రాయశ్చిత్తంగా శాస్త్రీయ నృత్యం చేయడం ప్రారంభిస్తాడు. ఇంతలో శరత్ బాబు వచ్చి అతన్ని ఆపుతాడు. ‘‘ఏమిట్రా పిచ్చెత్తినట్టు రోడ్డు మీద ఆ డాన్స్?’’ అంటూ మందలిస్తాడు. అప్పుడు కమల్‌ హాసన్ ఆ సినీ డాన్స్ డైరెక్టర్‌ గురించి ప్రస్తావిస్తూ ‘‘వాడో పచ్చి తాగుబోతు. వాడి దగ్గరకి నన్ను ఎందుకు పంపించావు?’’ అంటూ శరత్ బాబుతో గొడవ పడతాడు. కట్‌ చేస్తే... నెక్ట్స్‌ సీన్ వర్తమానంలోకి మారుతుంది. తెగ తాగి పడిపోయిన కమల్‌ హాసన్‌ని శరత్‌బాబు రిక్షాలో ఇంటికి తీసుకువెళ్తున్న దృశ్యం ప్రత్యక్షమవుతుంది. అంత గొప్ప కమల్‌ హాసన్ ఇంతగా ఎలా పతనమైపోయాడనే ఆసక్తి, ఆవేదన ప్రేక్షకుడికి కలుగుతాయి. విశ్వనాథ్‌ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్‌ (పర్యవేక్షణ) ప్రతిభకు ఇదో గొప్ప నిదర్శనం.

గేయ సాహిత్యం:

నా కన్నులు చూడని రూపం..

సిరివెన్నెల సినిమాలో సర్వదమన్ బెనర్జీ వేణువు వాయిస్తుంటాడు. కానీ ఆయనకు శాస్త్రీయ సంగీతం రాదు. గుడ్డివాడు కావడంతో రాగాలంటే ఏమిటో, వాటిలో ఉండే అనుభూతి ఏమిటో సరిగా తెలియదు. ఆ పరిస్థితుల్లో మున్‌మూన్ సేన్ అతడికి ఆ అనుభూతిని తెలియజేస్తుంది. దానితో అతడు గొప్ప సంగీత విద్వాంసుడిగా మారతాడు. ఆమెను దేవతగా ఆరాధిస్తూ ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ వాస్తవానికి మున్‌మూన్ సేన్ ఒక వేశ్య. తాను అపవిత్రురాలినని ఆమె భావిస్తుంటుంది. తన లాంటి వేశ్యకు బెనర్జీ వంటి కల్మషం లేని వ్యక్తిని పెళ్లి చేసుకునే అర్హత లేదని అనుకుంటుంది. కానీ పైకి ఏవేవో ఉత్తుత్తి కారణాలు చెబుతూ పెళ్లికి నిరాకరిస్తుంది. ఆమె వేశ్య అని తెలియని బెనర్జీ ఆమె చెప్పిన ఉత్తుత్తి కారణాలన్నింటినీ కొట్టి పారేస్తుంటాడు. ఆ సందర్భంలో వచ్చే పాట సిరి వెన్నెల సీతారామశాస్త్రి రాసినప్పటికీ అందులో విశ్వనాథ్‌ సృష్టించిన సన్నివేశ బలమే ఎక్కువగా కనిపిస్తుంది. ‘‘నా కన్నులు చూడని రూపం... గుడిలో దేవత ప్రతిరూపం... నీ రూపం’’ అని బెనర్జీ పాడతాడు. అతడి కోణంలో చూస్తే ‘‘నేను గుడ్డివాడిని కాబట్టి నిన్ను చూడలేను. నువ్వు నాకు దేవత లాంటి దానివి’’ అని అర్థం. కానీ మరో కోణంలో చూస్తే... నా కన్నులు చూడని రూపం అంటే ఆమె చీకటి జీవితం అని అర్థం. గుడిలో దేవతలకు వస్త్రాలు ఉండవంటారు. గుడిలో దేవత ప్రతిరూపం అంటే వస్త్రాలు లేని స్త్రీ అని అర్థం. (ఇక్కడ మున్‌మూన్ సేన్ స్విమ్‌ సూట్‌లో ఉండి విటులతో గడుపుతున్న దృశ్యాలు చూపిస్తారు) ఇటువంటి మహోన్నత సాహిత్యం రాయడంలో రచయిత పాత్ర ఎంత ఉందో దర్శకుడి పాత్ర అంతకంటే ఎక్కువే ఉంటుంది.

స్వర కల్పన:

హంసానంది రాగమై...

సాగర సంగమం సినిమా క్లైమాక్స్‌లో కమల్‌ హాసన్ మరణం ముంగిట ఉంటాడు. శైలజకు నాట్య శిక్షణ ఇచ్చి ఆమె రూపంలో తనలోని కళాకారుణ్ని బతికించుకోవాలన్న తపనతో ఆమెకు డాన్స్ నేర్పిస్తుంటాడు. శైలజ మాత్రం అతణ్ని ద్వేషిస్తూ ఉంటుంది. డాన్స్ చేస్తూ అతన్ని కాలితో తన్నుతుంది కూడా! మరణం అంచుల్లో ఉన్న కమల్‌ అటువంటి శిష్యురాలికి డాన్స్ నేర్పే సన్నివేశానికి ‘‘వేదం... అణువణువున నాదం. నా పంచ ప్రాణాల నాట్య వినోదం’’ అంటూ వేటూరి అద్భుతంగా పాట రాశారు. దానికి ఇళయరాజా ముందుగానే స్వరం ఇచ్చారు. ఈ పాటకు ఇళయరాజా వినిపించిన రాగాల్లో విశ్వనాథ్‌ హంసానంది రాగాన్ని ఎంపిక చేసుకున్నారు. వేదం ప్రధానంగా రేవతి రాగంలో ఉంటుంది. అందులోని మూడు ప్రధాన స్వరాలు (షట్జమం, శుద్ధ రిషభం, కాకలి నిషాదం) హంసానందిలో కూడా ఉంటాయి. అట్లాగే కల్యాణి వంటి కళాత్మక రాగాల్లో వాడే ప్రతిమధ్యమం కూడా హంసానందిలో ఉంటుంది. అంటే అటు వైరాగ్యాన్ని, ఇటు కళల్ని మేళవించిన రాగాన్ని సందర్భానుసారంగా ఎంచుకోవడం విశ్వనాథ్‌ సంగీత ప్రతిభకు అద్దం పడుతుంది.

డైలాగ్‌:

మనలాంటి తుచ్ఛులు

శ్రుతిలయలు సినిమాలో రాజశేఖర్‌ గొప్ప సంగీత విద్వాంసుడు. జయలలిత అతన్ని వలలో వేసుకుంటుంది. అతనితో సంగీత కచేరీల కాంట్రాక్టు మీద సంతకం చేయించుకుంటుంది. అప్పట్నుంచి రాజశేఖర్‌ మద్యానికి, మగువకు బానిసై పక్కదారి పడతాడు. రాజశేఖర్‌ను మార్చడానికి అతడి భార్య సుమలత, తమ కొడుకైన షణ్ముఖ శ్రీనివాస్‌తో సహా అతడి పక్కింట్లో దిగుతుంది. క్రమేపీ రాజశేఖర్ లో మార్పు వస్తుంది. తాను సంగీతాన్ని వదిలి తప్పుదారి పట్టానన్న ఆవేదన అతనిలో మొదలవుతుంది. మరోవైపు షణ్ముఖ శ్రీనివాస్‌ గొప్పగా పాడడంతోపాటు అద్భుతంగా డాన్స్ కూడా చేస్తుంటాడు. దీంతో జయలలిత కన్ను అతడిపై పడుతుంది. అతడితో కాంట్రాక్టుపై సంతకం చేయించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ రాజశేఖర్‌ దాన్ని అడ్డుకుంటాడు. దీంతో జయలలిత రాజశేఖర్‌తో గొడవకు దిగుతుంది. ‘‘నన్ను పెట్టుకున్నట్టే ఆ కుర్రాణ్ని కూడా నీ గుప్పిట్లో పెట్టుకోడానికి నేను అంగీకరించను’’ అని రాజశేఖర్‌ ఎదురు తిరుగుతాడు. ‘‘నా దగ్గర ఉండి నువ్వేమీ నష్టపోలేదే? నీ సంగీతాన్ని బతికించి ప్రజలకు అందించింది నేను’’ అని జయలలిత అంటుంది. దీంతో రాజశేఖర్‌ ‘‘అజరామరమైన సంగీతాన్ని మనలాంటి తుచ్ఛులు బతికించక్కర్లేదు’’ అని ఆవేదనతో బదులిస్తాడు. ఇక్కడ సంభాషణల రచయిత ఆకెళ్ల ‘‘మనలాంటి తుచ్ఛులు’’ అని రాయడం నిజంగా అద్భుతం. ఎందుకంటే తాను పతనమైపోవడం పట్ల రాజశేఖర్‌ మనసులో ఎంత ఆవేదన ఉందో ‘‘మనలాంటి తుచ్ఛులు’’ అనడంలో కనిపిస్తుంది. ఈ సన్నివేశానికి సంబంధించి విశ్వనాథ్‌ నుంచి అద్భుతమైన బ్రీఫింగ్‌ ఉంటే తప్ప రచయిత నుంచి ఇంత గొప్ప డైలాగ్‌ రావడం అసాధ్యం.

మేకప్‌:

గడ్డం కింద పుట్టుమచ్చ

స్వయంకృషి సినిమాలో చిరంజీవి ఓ చెప్పులు కుట్టే వ్యక్తి. విజయశాంతి అతన్ని ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే చిరంజీవి ఓ పిల్లవాణ్ని పెంచుకుంటుంటాడు. తనకు, విజయశాంతికి పెళ్లయి పిల్లలు పుడితే ఆ పిల్లవాణ్ని సరిగా చూడలేకపోతామేమో అనే చిన్న అనుమానం చిరంజీవికి ఉంటుంది. ఇది గ్రహించి విజయశాంతి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఈ సినిమాలో విజయశాంతికి పల్లెటూరి పిల్ల గెటప్‌ వేశారు. అయితే విశ్వనాథ్‌ మేకప్‌ ఆర్టిస్టుకు చెప్పి విజయశాంతి ముఖంపై గడ్డం కింద చిన్న పుట్టుమచ్చను పెట్టించినట్టు సమాచారం. గడ్డం కింద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు పిల్లలు కలగరని కొన్ని సాముద్రిక గ్రంథాల్లో ఉందట! అందుకని కావాలని ఆ మచ్చ పెట్టించినట్టు చెబుతారు. ఆ నమ్మకం గురించి సామాన్య ప్రజలెవరికీ తెలియకపోయినా... ఆ ఫీల్‌ మాత్రం వారికి కన్వే అవుతుందని విశ్వనాథ్‌ అభిప్రాయమట!

- ఆంధ్రజ్యోతి సెంట్రల్‌ డెస్క్‌.

Updated Date - 2023-02-03T21:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising