Hostels: వారెవ్వా.. ఏం ఐడియా సారూ.. విద్యార్థుల ఆత్మహత్యలను ఆపేందుకు హాస్టళ్లలో స్ప్రింగ్ ఫ్యాన్లను పెట్టిస్తున్నారు..!
ABN, First Publish Date - 2023-08-19T19:02:22+05:30
చిన్న చిన్న సమస్యలకూ ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల ఎక్కువైపోతోంది. అందులోనూ విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలిస్తారని, ఉద్యోగాలు రాలేదని, ప్రేమలో విఫలమయ్యామని.. ఇలా వివిధ రకాల సమస్యలకు పరిష్కారంగా చివరకు ...
చిన్న చిన్న సమస్యలకూ ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల ఎక్కువైపోతోంది. అందులోనూ విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలిస్తారని, ఉద్యోగాలు రాలేదని, ప్రేమలో విఫలమయ్యామని.. ఇలా వివిధ రకాల సమస్యలకు పరిష్కారంగా చివరకు ఆత్మహత్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు స్ప్రింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని (Rajasthan) కోట ప్రాంతం వివిధ రకాల కోచింగ్ సెంటర్లకు (Coaching Centres) ప్రసిద్ధి. దీంతో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ (Bihar, Uttar Pradesh, Madhya Pradesh) తదితర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు, నిరుద్యోగులు ఇక్కడికి కోచింగ్ తీసుకోవడానికి వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతంలో హాస్టళ్లు కోకొళ్లుగా వెలిశాయి. అయితే ఇటీవల చాలా మంది విద్యార్థులు వివిధ రకాల సమస్యలతో తీవ్ర మనసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువు ఒత్తిడితో కొందరు, ఉద్యోగం రాలేదనే బాధతో మరికొందరు ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. దీంతో ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.
చివరకు అన్ని హాస్టళ్లలో స్ప్రింగ్ ఫ్యాన్లను (Spring fans) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎవరైనా ఉరి వేసుకోవాలని ప్రయత్నిస్తే.. ఫ్యాను కిందకు జారిపోయేలా ఏర్పాట్లు చేశారు. కాగా, హాస్టళ్లలో ఫ్యాన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అధికారుల నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘స్ప్రింగ్ ఫ్యాన్లు అమర్చినంత మాత్రాన.. ఆత్మహత్యలు ఆగిపోతాయా’’.. అంటూ కొందరు, ‘‘విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది’’.. అని మరికొందరు, ‘‘ఆత్మహత్యకు గల కారణాలపై విశ్లేషించాలి గానీ.. ఫ్యాన్లను మారిస్తే సరిపోతుందా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి స్ప్రింగ్ ఫ్యాన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-08-19T19:02:22+05:30 IST