AirIndia Pee-Gate: విమానంలో వికృత చేష్టకు విధించింది అసలు శిక్షేనా?
ABN, First Publish Date - 2023-01-06T13:44:29+05:30
పీకలదాకా మద్యం తాగి విమానంలో ప్రయాణించడమే కాకుండా.. సహ ప్రయాణికురాలైన 75 ఏళ్ల పెద్దావిడపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి పడిన శిక్ష ఏంటంటే.. కేవలం నెల రోజులపాటు సదరు సంస్థ విమానాల్లో ప్రయాణించకుండా ఉంటే చాలు.
పీకలదాకా మద్యం తాగి విమానంలో (Plane) ప్రయాణించడమే కాకుండా.. సహ-ప్రయాణికురాలైన 75 ఏళ్ల పెద్దావిడపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి పడిన శిక్ష ఏంటంటే.. కేవలం నెల రోజులపాటు సదరు సంస్థ విమానాల్లో ప్రయాణించకుండా ఉంటే చాలు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే నిందిత వ్యక్తి పేరును నెలపాటు నో ఫ్లై లిస్ట్‌లో (No Fly List) పెడతారు. ఆ తర్వాత అంతా షరా మామూలే. అతడు ఎంచక్కా మళ్లీ విమానాలు ఎక్కేయొచ్చు. ఎక్కడికైనా తిరిగేయొచ్చు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎయిరిండియా విమానంలో మూత్ర విసర్జన-వివాదంలో (AirIndia Pee -Gate Incident) నిందిత వ్యక్తికి విధించిన శిక్ష ఇదీ. అంత జుగుస్సాకరమైన ప్రవర్తనకు ఇంత చిన్న చర్యా?. ఇదసలు శిక్షేనా?. ఇలాంటి చర్యలు విమాన ప్రయాణికుల దుష్ప్రర్తనలను నియంత్రించగలవా? .. విమానంలో ఎయిరిండియాలో మూత్ర విసర్జన-వివాదం నేపథ్యంలో సగటు వ్యక్తుల్లో రేకెత్తుతున్న సందేహాలు ఇవీ. మరి మన దేశంలో నో ఫ్లై లిస్ట్ (No Fly List) నిబంధనలు ఏం చెబుతున్నాయి?. శిక్షలు ఎలా నిర్ణయిస్తారు?.. ఇవే నిబంధనలు అగ్రరాజ్యం అమెరికాలో ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..
అసలు ఏం జరిగిందంటే..
గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఈ బరితెగింపు చర్య జరిగింది. ఫ్లైట్‌లోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణికుల భోజనం ముగిశాక లైట్లు ఆర్పివేసిన అనంతరం ముంబైకి చెందిన వ్యాపారవేత్త శంకర్ మిశ్రా (Shankar Mishra) ఓ 75 ఏళ్ల వయసున్న పెద్దావిడపై మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయమైన విమాన సిబ్బందికి బాధితురాలు ఫిర్యాదు చేసినా వారు అంతగా పట్టించుకోలేదు. నిందితుడు శంకర్ మిశ్రాను నెలపాటు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించారు. అంటే అతడి పేరును నో ఫ్లై లిస్ట్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారు. అయితే సిబ్బంది తీరు పట్ల నిరాశ చెందిన బాధితురాలు, న్యాయం కోరుతూ ఎయిరిండియా (AirIndia) గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు (N ChandraSekharan) లేఖ రాశారు. జరిగిన విషయాన్ని ఆయనకు సవివరంగా వెల్లడించారు. ఆ తర్వాతే ఈ ఘటనపై ఎయిరిండియా సిబ్బంది కళ్లు తెరిచింది. చాలా ఆలస్యంగా జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు సిబ్బంది చేశారు. దీంతో నిందితుడు శంకర్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతుండడంతో ఎయిరిండియా తాజాగా స్పందించింది. వికృత చేష్ట అనంతరం తాగుబోతు ప్రయాణికుడిని బాధిత మహిళ సీటు వద్దకు తీసుకెళ్లామని, ఆమెను క్షమాపణలు వేడుకున్నాడని ఎయిరిండియా సిబ్బంది చెప్పారు. అరెస్ట్ చేయకుండా కాపాడాలంటూ అడుక్కున్నాడని, ఆ సమయంలో బాధిత మహిళ మౌనం వహించడంతోనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కేసు నమోదు ఆలస్యానికి గల కారణాలను వెల్లడించారు.
భారత్‌లో 3-లెవల్స్ శిక్షలు.. ఇలా నిర్ణయిస్తారు..
విమానాల్లో భద్రత, ప్రయాణికుల వికృత చేష్టలు, నిబంధనల అతిక్రమణలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా 2017లో భారత ప్రభుత్వం ‘నేషనల్ నో ఫ్లై లిస్ట్’ను (National No Fly List) రూపొందించింది. షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ విమానాల్లో (scheduled, Non-scheduled flights) ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను నియంత్రించడమే ప్రధాన లక్ష్యం. విమానయాన సంస్థల సమాచారం ఆధారంగా డీజీసీఏ (DGCA) ఈ లిస్ట్‌ను రూపొందించి, నిర్వహిస్తుంటుంది. దీని ప్రకారం.. వ్యక్తులను నిర్దేశిత కాలంలో విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించడమే కాకుండా జరిమానాలు, క్రిమినల్ కేసులు వంటి చర్యలకు అవకాశం ఉంటుంది. మరి శిక్షలు ఎలా విధిస్తారో ఒకసారి పరిశీలిద్దాం.. విమానాల్లో వికృత చేష్టలు, ఘర్షణలు, భౌతిక దాడులు, ప్రాణానికి హాని కలిగించే ఇతర ఏ హానికర చర్యలకు పాల్పడినా నిందిత ప్యాసింజర్ల పేర్లను నో ఫ్లై లిస్ట్‌లో చేర్చుతారు. నేర తీవ్రతను బట్టి 3 లెవల్స్‌లో శిక్షలను నిర్ణయిస్తారు. వికృత చేష్టలు, గొడవలు, ఇబ్బంది కలిగించేలా మద్యపానం వంటి చర్యలు లెవల్-1 నేరాల పరిధిలోకి వస్తాయి. వీటికి 3 నెలల వరకు బ్యాన్ విధించే అవకాశం ఉంటుంది. ఇక భౌతిక దాడులు, అసభ్యకరంగా తాకడం లెవల్-2 నేరాల పరిధిలోకి వస్తాయి. దీని కింద 6 నెలల వరకు బ్యాన్ ఉంటుంది. ఇక ప్రయాణికుల ప్రాణాలకు హాని లేదా విమాన సిస్టమ్స్‌ను డ్యామేజీ చేయడం వంటి చర్యలు లెవల్-3 నేరాల పరిధిలోకి వస్తాయి. లెవల్-3 కింద కనీసం రెండేళ్ల వరకు బ్యాన్ విధిస్తారు. అయితే జీవితకాల నిషేధం విధిస్తారా లేదా అనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. తాజాగా ఎయిరిండియా విమానంలో వికృత చేష్టకు పాల్పడిన శంకర్ మిశ్రాకు లెవల్-1 కింద కేవలం 1 నెలపాటు నో ఫ్లై లిస్ట్ బ్యాన్ విధించారు. కాగా నో ఫ్లై లిస్ట్‌లోని వ్యక్తుల జాబితాలను డీజీసీఏ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. ఇక ఎయిర్‌పోర్టుల ప్రాంగణాల్లో జరిగే నేరాలకు సంబంధిత ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఛార్జి సెక్యూరిటీ ఏజెన్సీ పరిధిలోకి వస్తాయి.
అమెరికాలో కఠినాతికఠిన నిబంధనలు..
విమానయాన నిబంధనల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని అగ్రరాజ్యం అమెరికాకు (America) పేరుంది. మరి అనుచిత ప్రవర్తనకు పాల్పడే ప్రయాణికుల విషయంలో ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, అక్కడి ‘నో ఫ్లై లిస్ట్’ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఒకసారి గమనిద్దాం. వికృత చేష్టలు, అనుచిత ప్రవర్తనకు పాల్పడే ప్రయాణికులు విమానం ఎక్కకుండా నిషేధంతోపాటు భారీ జరిమానా ఉంటుంది. తీవ్రతపై ఈ చర్యలు ఆధారపడి ఉంటాయి. 37 వేల డాలర్ల వరకు ఫైన్ విధించేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రతిపాదనలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.8.32 లక్షల వరకు చెల్లించాల్సి రావొచ్చు. ఇక ఒకే నేరంలో ఒకటిపైగా అతిక్రమణలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి ఆధారంగా దర్యాప్తు, చర్యలు ఆధారపడి ఉంటాయి. జరిమానాలు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రీచెక్ స్టేటస్‌ను కూడా కోల్పోయే ప్రమాదం పొంచివుంటుంది. ఇక జాతీయ భద్రతా, సివిల్ ఏవియేషన్‌కు ప్రమాదకరంగా అనుమానించే వ్యక్తులు, ఉగ్రవాద అనుమానితులపై ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అమెరికా నుంచి, అమెరికాలోకి విమానాల్లో ప్రయాణించే అవకాశమే లేకుండా చేస్తారు. 9/11 దాడుల అనుభవంతో అత్యంత కఠినమైన ‘నో ఫ్లై లిస్ట్’ నిబంధనలను అమెరికా అమలు చేస్తోంది. ఇతర దేశాల నిబంధనలను అటుంచితే.. ఎయిరిండియా విమానంలో మూత్ర విసర్జన-వివాదంలో విధించిన శిక్ష నేపథ్యంలో దేశంలో మరోసారి ‘నో ఫ్లై లిస్ట్’ అంశం చర్చ తెరపైకి వచ్చింది. మరి ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో వేచిచూడాలి.
Updated Date - 2023-01-06T15:21:59+05:30 IST