Parents: పెళ్లయిన 7 ఏళ్లకు అందిన సంతానం.. అల్లారు ముద్దుగా పెంచుకుంటోంటే.. 4 ఏళ్ల వయసుకే ఇలా జరిగిందేంటి..?
ABN, First Publish Date - 2023-06-29T20:49:45+05:30
వివాహమైన తర్వాత దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని పరితపిస్తుంటారు. అయితే కొందరికి త్వరగా సంతానం అందితే.. మరికొందరికి చాలా ఆలస్యంగా అందుతుంటుంది. ఇంకొందరు సంతానం కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తుంటారు. అయినా చివరికి ...
వివాహమైన తర్వాత దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని పరితపిస్తుంటారు. అయితే కొందరికి త్వరగా సంతానం అందితే.. మరికొందరికి చాలా ఆలస్యంగా అందుతుంటుంది. ఇంకొందరు సంతానం కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తుంటారు. అయినా చివరికి నిరాశే మిగులుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా ఏళ్లకు కొందరికి అనూహ్యంగా పిల్లలు కలుగుతుంటారు. లేకలేక పుట్టిన పిల్లల్ని చూసుకుని ఎంతో మురిసిపోతుంటారు. తాజాగా, రాజస్థాన్‌కు చెందిన దంపతుల విషయంలోనూ ఇలాగే జరిగింది. పెళ్లయిన 7ఏళ్లకు కొడుకు జన్మించాడు. పిల్లాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటోంటే.. 4 ఏళ్ల వయసుకే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) భిల్వారా జిల్లా బిజోలియా పోలీస్ స్టేషన్ పరిధి జాజ్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకాష్ మీనా, ప్రేమ్ దేవి మీనా దంపతులకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. అందరిలాగే వీరు కూడా త్వరగా సంతానం కావాలని కోరుకున్నారు. అయితే వీరి కోరిక మాత్రం నెరవేరలేదు. దీంతో ఎన్నో ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. అలాగే చాలా ఆస్పత్రుల్లో చికిత్స కూడా తీసుకున్నారు. అయినా వీరికి సంతానం మాత్రం కలగలేదు. దీంతో దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురయ్యారు. ఇక సంతానం కలగదేమో అని అనుకునే సమయంలో నాలుగేళ్ల క్రితం అనూహ్యంగా వీరి కోరిక ఫలించి.. ప్రేమ్ దేవి ఓ బాబుకు జన్మనిచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లాడిని అల్లారు ముద్దుగా చూసుకునే వారు.
తర్వాత వీరికి కూతురు కూడా జన్మించింది. సంతానం కలగడంతో వీలు ఉన్నప్పుడల్లా గతంలో వెళ్లిన ఆలయాలకు మళ్లీ వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో గురువారం ఏకాదశిని పురస్కరించుకుని పిల్లల్ని తీసుకుని సమీపంలోని గుడికి వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించుకుని సంతోషంగా బైకుపై ఇంటికి బయలుదేరారు. ఈ ఆనందం కొన్ని గంటల్లో ఆవిరవుతుందని వారు ఊహించలేకపోయారు. మార్గమధ్యలో వీరి బైకును (lorry hit the bike) ఓ లారీ ఢీకొట్టింది. బాలుడి పైనుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. కళ్ల ముందే కొడుకు చనిపోవడం చూసి తల్లి స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు.. నాలుగేళ్లకే మృత్యు ఒడిలోకి జారుకోవడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలోకపోతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Updated Date - 2023-06-29T20:49:45+05:30 IST