Married Couple: పెళ్లయిన 3 గంటలకే షాకింగ్ సీన్.. ఈ వధూవరులు పోలీస్ స్టేషన్ ముందు ఎందుకిలా కూర్చోవాల్సి వచ్చిందంటే..!
ABN, First Publish Date - 2023-04-07T18:00:35+05:30
వివాహ కార్యక్రమాల నిర్వహణ తీరులో రోజురోజుకూ విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దీనికితోడు సోషల్ మీడియా ప్రభావం తోడవడంతో కార్యక్రమం మొదలు.. పూర్తయ్యే వరకూ ప్రతిదీ కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో కొన్ని వివాహ కార్యక్రమాలతో పాటూ..
వివాహ కార్యక్రమాల నిర్వహణ తీరులో రోజురోజుకూ విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దీనికితోడు సోషల్ మీడియా ప్రభావం తోడవడంతో కార్యక్రమం మొదలు.. పూర్తయ్యే వరకూ ప్రతిదీ కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో కొన్ని వివాహ కార్యక్రమాలతో పాటూ చాలా మంది వధూవరులు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‍గా మారుతున్నారు. ప్రస్తుతం ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లయిన మూడు గంటలకే షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. వధూవరులిద్దరూ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడంతో అంతా అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రత్లామ్ పరిధి రైల్వే కాలనీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అజయ్ సోలంకి అనే వ్యక్తికి.. ఇదే ప్రాంతానికి చెందిన కోమల్ అనే యువతితో వివాహం (marriage) నిశ్చయమైంది. ఇటీవల వివాహ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అతిథులు, స్నేహితులు, సన్నిహితులంతా కళ్యాణ మంటపానికి చేరుకున్నారు. మరోవైపు వధూవరులను (bride and groom) ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇటీవల దాదాపు ప్రతి వివాహ కార్యక్రమంలో డీజే పాటలు (DJ songs) ప్లే చేయడం సర్వసాధారణమైంది. ఈ వివాహ వేడుకలోనూ డీజే పాటలకు యువతీయువకులు ఉత్సాహంగా చిందులు వేస్తూ ఉన్నారు. ఇంతవరకూ ఎలాంటి సమస్యా లేకున్నా.. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. కొందరు యువకులు అత్యుత్సాహంతో డీజే పాటలకు సౌండ్ పెంచాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో చివరకు సౌండ్ విపరీతంగా పెంచేశారు.
దీనివల్ల అక్కడున్న వాళ్లకు ఇబ్బంది లేకున్నా.. చుట్టు పక్కల వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. సౌండ్ తగ్గించాలంటూ కోరినా ఎవరూ వినిపించుకోకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని వారించి, డీజే పాటలను ఆపించేశారు. దీంతో డాన్సులు వేస్తున్న వారితో పాటూ వధూవరులకూ విపరీతమైన కోపం వచ్చింది. వివాహమైన గంటల వ్యవధిలో పోలీస్ స్టేషన్ చేరుకుని, ఎదురుగా రోడ్డుపై కూర్చుని ఆందోళన చేపట్టారు. వధూవరులు కూడా రోడ్డుపై కూర్చోవడం చూసి అంతా అవాక్కయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరకుని, వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. కాగా, వధూవరులు రోడ్డుపై ధర్నా చేసిన ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Updated Date - 2023-04-07T18:00:35+05:30 IST