Water Allergy: మంచి నీళ్లు తాగినా.. స్నానం చేసినా ఈ యువతికి అలెర్జీ.. చిన్నప్పటి నుంచి నీళ్లు తాగకుండా ఎలా బతుకుతోందంటే..!
ABN, First Publish Date - 2023-10-04T21:49:39+05:30
రోజూ కనీసం 5నుంచి ఆరు లీటర్ల నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు చెబుతూ ఉంటారు. ఆరు లీటర్ల నీటిని తాగే విషయం పక్కన పెడితే అసలు నీరు తాగకుండా ఉండగలమా.. అంటే వామ్మో! అదెలా సాధ్యం అని అంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి..
రోజూ కనీసం 5నుంచి ఆరు లీటర్ల నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు చెబుతూ ఉంటారు. ఆరు లీటర్ల నీటిని తాగే విషయం పక్కన పెడితే అసలు నీరు తాగకుండా ఉండగలమా.. అంటే వామ్మో! అదెలా సాధ్యం అని అంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి.. నీళ్లు తాగినా, స్నానం చేసినా వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి. చిన్నప్పటి నుంచి ఆమె నీళ్లు తాగకుండా ఎలా బతుకుతోందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. యూఎస్ కాలిఫోర్నియాకు (US California) చెందిన టెస్సా హాన్సెన్ స్మిత్ అనే యువతి అరుదైన సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఈమె 8ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అందరి పిల్లల మాదిరే ఈత కొట్టడం, స్నానాలు చేయడం చేస్తూ ఉండేది. అయితే ఈ క్రమంలో ఓ రోజు ఆమె ఈత కొడుతూ ఉండగా ఎక్కువ శాతం నీరు తాగేసింది. కాసేపటి తర్వాత ఒళ్లంతా దద్దుర్లు రావడంతో పాటూ తలపై రక్తస్రావం కూడా మొదలైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు యువతి (young woman) ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అనే వాటర్ అలెర్జీ (water allergy) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆమె ఎప్పుడు నీరు తాగినా చర్మంపై దురద, దుద్దుర్లు వస్తుండడంతో నీరు తాగడమే మానేసింది. అప్పటి నుంచి నీటికి బదులుగా పాలు తీసుకుంటూ వచ్చింది.
ప్రస్తుతం సదరు యువతి వయసు 25 ఏళ్లు. ఇప్పటికీ ఆమె పాలు తాగుతూనే జీవిస్తోంది. కొన్నేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం చేసిన ఈమె.. తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో మానేసింది. ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. నడిచే క్రమంలో కాస్త చెమట పట్టినా కూడా సమస్య తలెత్తుండడంతో కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేసుకుంది. యువతికి చికిత్స చేయడం కష్టతరమవడంతో కుటుంబ సభ్యులు ఇటీవల గోఫండ్ (GoFundMe) పేజీని ఏర్పాటు చేశారు. తద్వారా ఎంతో మంది ముందుకొచ్చి విరాళాలు అందజేశారు. దీంతో కేవలం మూడు నెలల్లోనే $10,000 (రూ.8,32200) విరాళం అందింది. ఇటీవల యువతి స్పందిస్తూ.. పెద్ద మనసుతో స్పందించి విరాళాలు అందజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 నుంచి 250 మంది మాత్రమే ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యువతికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-10-04T21:49:39+05:30 IST