Viral Video: మహిళకు ఆపరేషన్ చేస్తుండగా సడన్‌గా కంపించిన కంప్యూటర్లు.. ఒక్కసారిగా చీకటి ఆవరించడంతో చివరకు ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-03-22T16:55:13+05:30
వైద్యో నారాయణో హరిః!! అన్న నానుడికి నిదర్శనంగా కొందరు వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగుల ప్రాణాలను కాపాడుతుంటారు. ఎలాంటి లాభాపేక్ష చూసుకోకుండా.. ప్రాణాలపై ఆశలు వదులుకున్న రోగులకు..
వైద్యో నారాయణో హరిః!! అన్న నానుడికి నిదర్శనంగా కొందరు వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగుల ప్రాణాలను కాపాడుతుంటారు. ఎలాంటి లాభాపేక్ష చూసుకోకుండా.. ప్రాణాలపై ఆశలు వదులుకున్న రోగులకు తిరిగి ప్రాణం పోసిన వైద్యులను ఎందరినో చూస్తుంటాం. ఇందుకు సంబంధించిన అనేక వార్తలను తరచూ వింటూ ఉంటాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. మహిళకు ఆపరేషన్ చేస్తుండగా సడన్‌గా కంప్యూటర్లన్నీ కంపించాయి. వెనువెంటనే చిమ్మ చీకటి అలుముకుంది. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో వైద్యుల ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ (doctors Viral videos) అవుతోంది. కశ్మీర్ (Kashmir) అనంత్‌నాగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం దేశంలోని పలు ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించింది. అయితే భూకంపం సంభవించే సమయానికి ముందు స్థానిక ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి (pregnant woman) పురటినొప్పులు వచ్చాయి. దీంతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆపరేషన్ (Operation) చేస్తుండగా మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ఆపరేషన్ థియేటర్‌లోని కంప్యూటర్లు అన్నీ ఒక్కసారిగా కంపించాయి. దీంతో అక్కడ ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు.
కొందరు మహిళా వైద్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చూస్తుండగానే అక్కడ మొత్తం చీకటి ఆవరించింది. ఇంకొందరు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించారు. భూకంపం వచ్చిందని తెలుసుకున్నా.. వైద్యులు మాత్రం ఏమాత్రం చలించలేదు. తమ ప్రాణాల కంటే మహిళ ప్రాణాలకే విలువ ఇచ్చారు. ఆపరేషన్ పూర్తయ్యే వరకూ అక్కడి నుంచి కదల్లేదు. కొద్ది సేపటికి మళ్లీ లైట్లు వెలగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. అలాంటి సమయంలోనూ వృత్తి ధర్మాన్ని పాటించిన సదరు వైద్యులను జిల్లా వైద్యాధికారులతో పాటూ నెటిజన్లు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Updated Date - 2023-03-22T16:55:13+05:30 IST