Jagan: విజయసాయి కూతురి కోసం జగన్ వస్తారా..? ఫైనల్‌గా తెలిసిందేంటంటే..
ABN, First Publish Date - 2023-02-19T18:46:14+05:30
నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna). ప్రస్తుతం ఈ పేరు తలుచుకుంటేనే దు:ఖం ఉబికివస్తున్న పరిస్థితి. ఈ ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ (Okato Number Kurradu) ఇక లేడు, తిరిగి రాడనే వార్తను..
నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna). ప్రస్తుతం ఈ పేరు తలుచుకుంటేనే దు:ఖం ఉబికివస్తున్న పరిస్థితి. ఈ ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ (Okato Number Kurradu) ఇక లేడు, తిరిగి రాడనే వార్తను కేవలం నందమూరి అభిమానులే (Nandamuri Fans) కాదు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకు కారణం వివాదరహితుడిగా తారకరత్న జీవించిన విధానమేనని ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఇటీవల టీడీపీ తరపున యాక్టివ్ అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలపై రాజకీయంగా విమర్శలు చేశారే తప్ప తారకరత్న ఏనాడు వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. ఆ హుందాతనమే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వారు కూడా ఆయన చనిపోయారనే విషయం తెలిశాక ‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగిపోయింది’ అని చింతించేలా చేసింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం ఉదయం నుంచి తారకరత్న నివాసంలోనే ఉండి అన్నీ తానై వ్యవహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం విజయసాయితో మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఇంత చొరవ చూపించడం వెనుక కారణం ఏంటో ఈపాటికే చాలామందికి తెలిసే ఉంటుంది. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి మరెవరో కాదు విజయసాయిరెడ్డికి స్వయానా మరదలి కూతురు. విజయసాయిరెడ్డి భార్య, తారకరత్న అత్తయ్య అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. తారకరత్న కొద్ది మంది సమక్షంలో హైదరాబాద్ నగర శివారులోని సంఘీ టెంపుల్‌లో అలేఖ్యా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తారకరత్నకు విజయసాయిరెడ్డి వరుసకు మామయ్య అవుతారు. ఈ బంధుత్వం కారణంగానే విజయసాయిరెడ్డి ఈ కష్ట కాలంలో ఆ తారకరత్న కుటుంబానికి అండగా నిలిచారు. ఈ పరిణామాలను గమనించిన సినీరాజకీయ వర్గాల్లో తాజాగా ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వైసీపీ అధినేత జగన్ రెడ్డి హైదరాబాద్‌కు రావొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. జగన్ రెడ్డికి, విజయ సాయిరెడ్డికి ఎలాంటి సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లిన సమయంలో, ప్రతిపక్ష నేతగా జగన్ విస్తృతంగా పాదయాత్రలో నిమగ్నమైన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పాలన సాగిస్తున్న సమయంలో కూడా జగన్‌కు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. వైసీపీ తరపున ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టేంత బాధ్యతలను జగన్ విజయసాయికి అప్పజెప్పారంటే ఇద్దరూ ఎంత మంచి ఆప్తులో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి విజయసాయిరెడ్డికి కూతురు లాంటి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కోసం జగన్ కదలివెళతారని కొందరు, విజయసాయిరెడ్డి భార్య తరపు బంధుత్వమే కావడం వల్ల జగన్ వెళ్లకపోవచ్చని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి ఉన్న సమాచారమైతే.. తారకరత్న కడసారి చూపునకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లకపోవచ్చనే తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపిన జగన్ రెడ్డి నేరుగా వెళ్లకపోవచ్చని సమాచారం.
సినీ నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం నందమూరి అభిమానులను, టీడీపీ శ్రేణులను తీవ్రంగా కలచివేసింది. మహాశివరాత్రి రోజు ఆ పరమశివుడిలో తారకరత్న శివైక్యం అయ్యారని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి పలువురు ప్రముఖులు తారకరత్న భౌతికకాయానికి నివాళి అర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ యువ నేత నారా లోకేష్, బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, చిరంజీవి, అలీతో పాటు పలువురు సినీరాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పించారు.
Updated Date - 2023-02-19T18:47:49+05:30 IST