Asian Games 2023: భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం.. ఏ క్రీడలో అంటే..?
ABN, First Publish Date - 2023-09-28T08:59:34+05:30
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది.
హాంగ్జౌ: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ బంగారు పతకాన్ని గెలిచారు. దీంతో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణ పతకం చేరింది. ఇందులో ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనే 4 స్వర్ణ పతకాలు రావడం విశేషం. అంతకుముందు ఉమెన్స్ వుషూ(మార్షల్ ఆర్ట్స్) 60 కేజీలో విభాగంలో రొషిబినా దేవి రజత పతాకాన్ని గెలిచింది.
మొత్తంగా ఆసియా క్రీడల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత షూటర్ల తుపాకులు ఘనంగా పేలాయి. పిస్టల్‌లో తెలుగమ్మాయి ఇషా సింగ్ డబుల్ ధమాకా సృష్టించగా.. రైఫిల్ విభాగంలో సమ్రా సిఫ్ట్ కౌర్ ప్రపంచ రికార్డు స్వర్ణం సహా రెండు పతకాలు కొల్లగొట్టింది. దీంతో ఆసియా క్రీడల నాలుగో రోజైన బుధవారం భారత్ రెండు స్వర్ణాలు సహా ఎనిమిది పతకాలు సాధించింది. మొత్తంగా 24 పతకాల (6 స్వర్ణ, 8 రజత, 10 కాంస్య)తో ఏడో స్థానంలో నిలిచింది. మహిళల 25 మీ. పిస్టల్ ర్యాపిడ్ విభాగంలో ఇషా సింగ్, మను భాకర్, రిథమ్ సంగ్వాన్‌ల జట్టు 1759 పాయింట్లతో టాప్‌లో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకొంది. చైనా, కొరియాలు రజత, కాంస్యాలు దక్కించుకొన్నాయి. కాగా, 25 మీ. పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా రజతం గెలిచింది. ఫైనల్లో ఆమె 34 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకొంది. అర్హత రౌండ్లో టాప్‌లో నిలిచిన మను భాకర్.. ఫైనల్లో పేలవ ప్రదర్శనతో ఐదో స్థానంతో సరిపెట్టుకొంది. 38 పాయింట్లు సాధించిన రుయి లు (చైనా) ఆసియా రికార్డుతో స్వర్ణం గెలవగా.. జిన్ యాంగ్ (కొరియా) 29 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకొంది.
50 మీ. రైఫిల్ 3 పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సమ్రా ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం కొల్లగొట్టింది. ఫైనల్లో 469.6 పాయింట్లు సాధించిన కౌర్ టాప్‌లో నిలిచింది. ఈ క్రమంలో మకింతోష్ సియోనైడ్ (బ్రిటన్) 467 పాయింట్ల వరల్డ్ రికార్డును సమ్రా అధిగమించింది. కాగా, కౌర్ సహచరి ఆషి చోక్సీ 451.9 పాయింట్లతో కాంస్యం సాధించగా.. క్వియాంగ్యు జాంగ్ (చైనా) 462.3 పాయింట్లతో రజతం సొంతం చేసుకొంది. ఇక, 50 మీ. రైఫిల్ 3 పొజిషన్ టీమ్ ఈవెంట్లో సమ్రా కౌర్, మానిని కౌశిక్, ఆషి చోక్సీ త్రయం 1764 పాయింట్లలతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. చైనా టీమ్ 1773 పాయింట్లతో పసిడి నెగ్గగా.. కొరియా జట్టు 1756 పాయింట్లతో కాంస్యం దక్కించుకొంది. పురుషుల స్కీట్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్ జీత్ సింగ్ నరుకా రజతం నెగ్గాడు. 58 పాయింట్లు సాధించిన అనంత్ రెండో స్థానంలో నిలవగా.. కువైట్ షూటర్ అబ్దుల్లా అల్‌రషీద్ (60 పాయింట్లు) ప్రపంచ రికార్డు సమం స్కోరుతో స్వర్ణం నెగ్గాడు. కతార్‌కు చెంది నాసర్ అల్ అట్టియా కాంస్యం దక్కించుకొన్నాడు. కాగా, స్కీట్ టీమ్ ఈవెంట్లో అంగద్ వీర్ సింగ్, గుర్జోత్ సింగ్, అనంత్ జీత్ల త్రయం 355 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకొంది. చైనా, కతార్ జట్లు టాప్-2లో నిలిచాయి.
Updated Date - 2023-09-28T09:08:35+05:30 IST