Ashes Series: మూడో టెస్టులోనూ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పదా?
ABN, First Publish Date - 2023-07-04T19:12:05+05:30
ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ గెలవాలంటే మిగతా మూడు టెస్టుల్లోనూ గెలిచి తీరాల్సిందే. కానీ పరిస్థితులు ఆ జట్టుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి.
క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌కు ఆదరణ భారీగా ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల తరహాలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు (Ashes Series) క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia) డామినేషన్ కొనసాగుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఆ జట్టు పైచేయి సాధించింది. తొలి టెస్టును ఇంగ్లండ్ (England) అతి విశ్వాసానికి పోయి కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నా ఆలౌట్ కాకుండానే డిక్లరేషన్ చేసి వెనుకంజ వేసింది. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పోరాటం సరిపోలేదు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben stokes) భారీ సెంచరీతో రాణించినా ఆ జట్టు ఓటమి పాలైంది.
ఇది కూడా చదవండి: టీ20ల్లో రోహిత్, కోహ్లీ భవితవ్యం తేల్చేది అతడేనా?
ఇప్పుడు ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ గెలవాలంటే మిగతా మూడు టెస్టుల్లోనూ గెలిచి తీరాల్సిందే. కానీ పరిస్థితులు ఆ జట్టుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కీలక ఆటగాడు పోప్ భుజం గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు మూడో టెస్టు జరిగే హెడింగ్లీలో ఇంగ్లండ్ ట్రాక్ రికార్డు చాలా చెత్తగా ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆడిన గత ఏడు టెస్టుల్లో ఒక్క విజయం కూడా సాధించలేదు. ఆరు పరాజయాలు, ఒక డ్రా మాత్రమే ఉన్నాయి. దీంతో హెడింగ్లీలో వరుస ఓటములకు ఇంగ్లండ్ చెక్ పెడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. బజ్ బాల్ క్రికెట్ అంటూ దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ విజయానికి సరిపడా అయితే పరుగులు సాధించడం లేదు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు జో రూట్ లార్డ్స్ టెస్టులో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి రూట్ 192 పరుగులు మాత్రమే చేశాడు. మూడో టెస్టులో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మూడో టెస్టులో కూడా ఇంగ్లండ్ ఓడిపోతే యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా సొంతం కానుంది.
Updated Date - 2023-07-04T19:14:41+05:30 IST