Yashasvi Jaiswal: రాజమౌళి సినిమాలో జైశ్వాల్ నటించాడా?
ABN, First Publish Date - 2023-07-15T15:28:27+05:30
సోషల్ మీడియాలో జైశ్వాల్ గురించి ఓ మీమ్ చక్కర్లు కొడుతోంది. అతడు క్రికెట్‌లోకి రాకముందు సినిమాల్లో నటించాడని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. దీంతో యషస్వీ జైశ్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం నటించాడని అంటున్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో బాలనటుడిగా జైశ్వాల్ నటించినట్లు ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
టీమిండియాలో యషస్వీ జైశ్వాల్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి తన సత్తా నిరూపించుకున్నాడు. దీంతో ఏకంగా టీమిండియాలో స్థానం సంపాదించాడు. వెస్టిండీస్ పర్యటనలో అన్ని ఫార్మాట్లలోనూ యషస్వీ జైశ్వాల్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. అయితే వచ్చిన అవకాశాన్ని జైశ్వాల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగాడు. అరంగేట్ర టెస్టులోనే భారీ సెంచరీతో అదరగొట్టాడు. 387 బాల్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 171 రన్స్ చేశాడు. అయితే డబుల్ సెంచరీ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియాకు మరో స్టార్ దొరికాడని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిలకడగా రాణిస్తే జైశ్వాల్ రానున్న రోజుల్లో స్టార్ క్రికెటర్‌గా మారతాడని అందరూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో జైశ్వాల్ గురించి ఓ మీమ్ చక్కర్లు కొడుతోంది. అతడు క్రికెట్‌లోకి రాకముందు సినిమాల్లో నటించాడని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. దీంతో యషస్వీ జైశ్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం నటించాడని అంటున్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో బాలనటుడిగా జైశ్వాల్ నటించినట్లు ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు. అయితే ఆ పిల్లవాడు జైశ్వాల్ కాదని తెలుస్తోంది. యషస్వీ అచ్చం ఆ బాలనటుడి మాదిరిగా ఉండడంతో ప్రచారం జరుగుతోందని అతడి సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఖాతాలోకి రెండు రికార్డులు
కాగా టీమిండియాలో తొలి టెస్టులోనే భారీ సెంచరీతో రాణించిన యషస్వీ జైశ్వాల్‌కు మంచి భవిష్యత్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. పుజారా స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి టీంలో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో మరో 29 పరుగులు చేస్తే అరంగేట్ర మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్ చరిత్రలో నిలిచేవాడు. ఒకవేళ మరో 17 పరుగులు చేసి ఉంటే భారత్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ అయ్యేవాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్(187), రోహిత్ శర్మ(177) జైశ్వాల్ (171) కంటే ముందున్నారు.
Updated Date - 2023-07-15T15:31:49+05:30 IST