Team India: మరో మూడు మ్యాచ్‌లకు పాండ్యా దూరం.. టీమ్ కాంబినేషన్ సెట్ అయ్యేనా?
ABN, First Publish Date - 2023-10-27T16:11:18+05:30
మరో మూడు మ్యాచ్‌ల వరకు హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లకు పాండ్య జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా బంగ్లాదేశ్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే మరో మూడు మ్యాచ్‌ల వరకు హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లకు పాండ్య జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో టీమ్ కాంబినేషన్‌పై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఓటమి లేకుండా సాగుతున్న టీమిండియా టైటిల్ సాధించాలంటే పాండ్యా లాంటి ఆల్‌రౌండర్ జట్టులో ఉండటం తప్పనిసరి. కానీ పాండ్య లేకపోవడం వల్ల కూర్పు దెబ్బతింటోంది. అతడి స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్ లేదా స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బౌలింగ్ వరకు షమీతో పూడ్చడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ బలం కోసం సూర్యకుమార్‌ను కొనసాగించాలా లేదా అదనపు బౌలర్ కోసం అశ్విన్‌ను తీసుకోవాలా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Team India: కష్టాల్లో టీమిండియా మాజీ కోచ్.. అడుక్కోవాల్సిన పరిస్థితి..!!
మొత్తానికి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి. మరోవైపు గాయపడ్డ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాయంతో బాధ పడుతున్న పాండ్యాకు సరైన ఇంజెక్షన్లు ఇస్తే మ్యాచ్ ఆడగలడు అని.. కానీ దీని వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని సమాచారం. శనివారం నాటికి పాండ్యా మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెడతాడని టాక్ నడుస్తోంది. అతడికి ఇంజెక్షన్లు ఇచ్చి ఇంగ్లండ్‌తో మ్యాచులో బరిలో దింపే అవకాశం ఉన్నా ఇది సరైన పద్ధతి కాదని బీసీసీఐ భావిస్తోందట. అందుకే పాండ్యా సహజంగా కోలుకునే వరకూ వెయిట్ చేయాలని బీసీసీఐ అభిప్రాయపడుతోంది.
Updated Date - 2023-10-27T16:11:18+05:30 IST