Jasprit Bumrah: బుమ్రా కోసం మరికొంత కాలం ఆగాల్సిందే!
ABN, First Publish Date - 2023-02-20T18:59:16+05:30
గాయాలతో బాధపడుతూ గత కొంతకాలంగా జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా
న్యూఢిల్లీ: గాయాలతో బాధపడుతూ గత కొంతకాలంగా జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కోసం అభిమానులు మరికొంత కాలం ఆగక తప్పేలా లేదు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)లో పునరావాసంలో ఉంటూ కోలుకుంటున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లోని చివరి రెండు టెస్టుల కోసం బీసీసీఐ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో బుమ్రా పేరు లేదు. అంటే ఈ ఈ సిరీస్ మొత్తానికి బుమ్రా దూరమైనట్టే.
టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్‌కు కూడా బుమ్రా అందుబాటులో ఉండడం లేదు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం లేదు. అంటే బుమ్రా ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశాలు లేనట్టే.
ఆసీస్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుమ్రా తన జట్టు ముంబై తరపున ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు బుమ్రాను ఎంపిక చేయకపోవడంపై ట్విట్టర్ వేదికగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
భారత జట్టులో బుమ్రా అత్యంత కీలక ప్లేయర్‌గా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందించగల బుమ్రా లేని లోటు జట్టులో కనిపిస్తోందంటూ అభిమానులు చెబుతున్నారు. అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటేనని, కాకపోతే ప్రపంచకప్ నేపథ్యంలో కొత్త కుర్రాళ్లను పరీక్షించే అవకాశం లభించినట్టు అయిందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఐపీఎల్ కోసం బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం లేదని విమర్శిస్తున్నారు.
Updated Date - 2023-02-20T18:59:18+05:30 IST