IND vs SA: ఒక స్పిన్నర్ చాలు.. తొలి టెస్టుకు గంభీర్ ఎంపిక చేసిన టీమిండియా తుది జట్టు ఇదే!
ABN, Publish Date - Dec 24 , 2023 | 10:08 PM
మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26 నుంచి తొలి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. దీంతో ఈ సారి సౌతాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
సెంచూరియన్: మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26 నుంచి తొలి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. దీంతో ఈ సారి సౌతాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తద్వారా సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఒక టెస్టు సిరీస్ విజయం కూడా లేని లోటును తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి టెస్టు మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే అంశంపై గౌతం గంభీర్ తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. తన ప్లేయింగ్ 11లో గంభీర్ ఒకే ఒక స్పిన్నర్‌కు చోటు ఇవ్వడం గమనార్హం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆడాలని సూచించాడు. తద్వారా లెఫ్ట్, రైట్ కాంబినేషన్ సెట్ అవుతుందని అభిప్రాయపడ్డాడు.
మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశాడు. గతంలో ఈ స్థానంలో చటేశ్వర్ పుజారా, రాహుల్ ద్రావిడ్ ఆడిన సంగతి తెలిసిందే. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని కొనసాగించాడు. ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. ఆరో స్థానానికి బ్యాటర్, వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంచుకున్నాడు. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి నలుగురు ఫాస్ట్ బౌలర్లను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు. దీంతో ఇదే జరిగితే ప్రసిద్ధ్ కృష్ణ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇక ఒకే ఒక్క స్పిన్నర్ చాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. స్పిన్ కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఒకరికే చోటు కల్పించాలని పేర్కొన్నాడు.
గంభీర్ టీమిండియా తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా/రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
Updated Date - Dec 24 , 2023 | 10:11 PM