IND vs NZ: కుప్పకూలిన కివీస్.. టీమిండియా ముందు ఉఫ్ అని ఊదేసేంత టార్గెట్
ABN, First Publish Date - 2023-01-21T16:38:17+05:30
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. కివీస్ బ్యాటింగ్‌ను కకావికలం చేశారు. ఫలితంగా 34.3 ఓవర్లలో 108 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలిపోయింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో..
రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. కివీస్ బ్యాటింగ్‌ను కకావికలం చేశారు. ఫలితంగా 34.3 ఓవర్లలో 108 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలిపోయింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే షమీ షాకిచ్చాడు. మహ్మద్ షమీ బౌలింగ్ చేసిన తొలి ఓవర్‌లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అక్కడి నుంచి న్యూజిలాండ్ బ్యాటింగ్ పతనం ప్రారంభమైంది. 8 పరుగుల వద్ద హెన్రీ నికోలస్ సిరాజ్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌గా దొరికిపోయాడు. ఇలా రెండో వికెట్ కోల్పోయింది.
షమీ బౌలింగ్ చేసిన ఏడో ఓవర్‌లో మిచెల్ షమీకే క్యాచ్‌గా దొరికిపోయాడు. కివీస్ ఓపెనర్ కాన్వే 7 పరుగులు మాత్రమే చేసి హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట్ అయి పెవిలియన్‌కు వెళ్లాడు. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ 36 పరుగులు చేసి ఆడుతుండగా సుందర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి సూర్యకుమార్‌కు క్యాచ్‌గా దొరికిపోయాడు.
తొలి వన్డేలో బెంబేలెత్తించిన బ్రేస్‌వెల్ 22 పరుగులకే షమీ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు కీపర్ క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. శాంట్నర్ కూడా 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా ఔట్ కావడం, ఫెర్గ్యూసన్ కూడా సుందర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్‌గా దొరికిపోవడంతో కివీస్ కథ ముగిసింది. 108 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ కావడంతో ఈ వన్డే సిరీస్ దాదాపు టీమిండియాదేనని అభిమానులు భావిస్తున్నారు. 109 పరుగుల స్వల్ప టార్గెట్‌తో టీమిండియా బ్యాటింగ్‌కు దిగనుంది. టీమిండియా బౌలర్లలో షమీ 3 వికెట్లతో రాణించాడు. సుందర్, హార్థిక్ చెరో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు. సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌కు తలో వికెట్ దక్కింది. తొలి వన్డేతో పోలిస్తే రెండో వన్డేకు టీమిండియా బౌలర్లు పరిణతి కనబర్చారు. తొలి వన్డేలో బ్రేస్‌వెల్, శాంట్నర్ 160 పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించి భారత బౌలర్లకు సవాల్ విసిరారు.
Updated Date - 2023-01-21T16:41:04+05:30 IST