Ireland T20 Series: చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. తొలి భారత బౌలర్‌గా రికార్డు..!!
ABN, First Publish Date - 2023-08-16T16:05:14+05:30
15 ఏళ్లుగా టీ20లు జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క బౌలర్ కూడా ఈ ఫార్మాట్‌లో టీమిండియాకు నాయకత్వం వహించలేదు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 10 మంది భారత్‌కు సారథ్యం వహించారు. అందులో ఒక్క స్పెషలిస్ట్ బౌలర్ కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో టీ20ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న తొలి స్పెషలిస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు.
టీమిండియా మరో టీ20 సిరీస్ సమరానికి సిద్ధం అవుతోంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయిన భారత్.. ఈనెల 18 నుంచి ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియాకు మరో కెప్టెన్ రాబోతున్నాడు. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వంలో యువ ఆటగాళ్లు ఐర్లాండ్‌తో సిరీస్‌లో తలపడనున్నారు. దీంతో బుమ్రా చరిత్ర సృష్టించబోతున్నాడు. ఎందుకంటే 15 ఏళ్లుగా టీ20లు జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క బౌలర్ కూడా ఈ ఫార్మాట్‌లో టీమిండియాకు నాయకత్వం వహించలేదు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 10 మంది భారత్‌కు సారథ్యం వహించారు. అందులో ఒక్క స్పెషలిస్ట్ బౌలర్ కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఈ జాబితాలో 9 మంది బ్యాటర్లు ఉండగా మరొకరు ఆల్‌రౌండర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీ20ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న తొలి స్పెషలిస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు.
టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు సారథ్యం వహించిన తొలి ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. అతడి తర్వాత వికెట్ కీపర్ ధోనీ పగ్గాలను అందుకున్నాడు. అతడి గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లకు సురేష్ రైనా, ఆజింక్యా రహానె లాంటి ఆటగాళ్లు భారత జట్టుకు నాయకత్వం వహించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత శిఖర్ ధావన్, కేెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కొన్ని మ్యాచ్‌లలో జట్టును ముందుండి నడిపించారు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీ20లలో నాయకుడిగా వ్యహరిస్తున్నాడు. కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడిన జట్టులో చాలా మంది ఆటగాళ్లకు సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. వారిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఉన్నారు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లాంటి టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. దీంతో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ లాంటి మెగా లీగ్‌లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, శివం దూబె, జితేష్ శర్మ లాంటి ఆటగాళ్లు ఐర్లాండ్ సిరీస్‌తో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అటు గాయాల నుంచి కోలుకున్న ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ తమ పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Wahab Riaz: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ బౌలర్
ఐర్లాండ్‌తో సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఒకే వేదికలో జరగనున్నాయి. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో డబ్లిన్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. వయాకామ్ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ 18, జియో సినిమా ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఈ సిరీస్‌లో కరేబియన్ గడ్డపై అరంగేట్రంలోనే అదరగొట్టిన లెఫ్ట్ హ్యాండర్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ కీలకంగా మారనున్నారు.
Updated Date - 2023-08-16T16:10:56+05:30 IST