KL Rahul: రాహుల్ భావోద్వేగ పోస్ట్.. ప్రపంచకప్ ఓటమి ఇంకా బాధిస్తోంది..!!
ABN, First Publish Date - 2023-11-23T15:02:27+05:30
Team India: టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘స్టిల్ హర్ట్స్’ అంటూ ఒక్క ముక్కలో తన ఆవేదన గురించి కేఎల్ రాహుల్ రాసుకొచ్చాడు. అంటే ఇంకా ఓటమి బాధిస్తోందని అతడు చెప్పకనే చెప్పాడు.
వన్డే ప్రపంచకప్ ఓటమిని అభిమానులతో పాటు టీమిండియా క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఫైనల్లో ఎదురైన ఓటమిని టీమిండియా క్రికెటర్లు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. తాజాగా టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘స్టిల్ హర్ట్స్’ అంటూ ఒక్క ముక్కలో తన ఆవేదన గురించి కేఎల్ రాహుల్ రాసుకొచ్చాడు. అంటే ఇంకా ఓటమి బాధిస్తోందని అతడు చెప్పకనే చెప్పాడు. ఎన్నో కలలు కని, తమ వ్యూహాలను అమలు పరిచి ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ చేరిన టీమిండియా చివరిమెట్టుపై బోల్తా పడటం అందరినీ షాక్‌కు గురిచేసిందని.. ఈ ఓటమి నుంచి బయటపడేందుకు కొంచెం సమయం పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేస్తే త్వరగానే ప్రపంచకప్ ఓటమి నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఆస్ట్రేలియాపై మరోసారి ఘోరంగా ఆడితే పుండు మీద కారం చల్లినట్లేనని స్పష్టం చేస్తున్నారు.
కాగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టాస్ ఓడి టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. రోహిత్ ధాటిగానే బ్యాటింగ్ చేసినా గిల్ త్వరగా ఔట్ కావడం ఒత్తిడికి గురిచేసింది. వెంటనే శ్రేయాస్ అయ్యర్ కూడా ఔట్ కావడంతో టీమిండియా మరింత ఒత్తిడిలో పడింది. రోహిత్ కూడా 47 పరుగులకే ఔట్ కావడంతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. బౌండరీలు లేకుండా సింగిల్స్, డబుల్స్‌పైనే దృష్టి సారించారు. దీంతో టీమిండియా రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. చివరకు 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయినా ఒత్తిడిలో పడకుండా ఆడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో మూడోసారి ప్రపంచకప్ సాధించాలన్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఆస్ట్రేలియా మాత్రం తమ చరిత్ర తామే తిరగరాస్తూ ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-23T15:02:29+05:30 IST