MI vs UPW: ముంబైకి వారియర్స్ ధమ్కీ.. వరుస విజయాల తర్వాత తొలి ఓటమి!
ABN, First Publish Date - 2023-03-18T19:27:31+05:30
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) హవాకు బ్రేక్
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) హవాకు బ్రేక్ పడింది. యూపీ వారియర్స్(UP Warriorz)తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో వారియర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించిన ముంబైకి ఆరో మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. అయినప్పటికీ 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ముంబై నిర్దేశించిన 128 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన వారియర్స్ తొలుత తడబడింది. ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 27 పరుగులకే మూడు, 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడింది. అయితే, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశారు.
సాధించాల్సిన స్కోరు తక్కువగా ఉండడంతో నిదానంగా ఆడుతూ స్కోరు పెంచుతూ విజయానికి దగ్గర చేశారు. ఈ క్రమంలో 25 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 38 పరుగులు చేసిన తహ్లియా 71 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగింది. అయితే, క్రీజులో ఉన్న గ్రేస్ హారిస్ మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా క్రీజును అంటిపెట్టుకుని జట్టును విజయానికి మరింత దగ్గర చేసింది. 28 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన హారిస్ 105 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగింది. అప్పటికే జట్టు దాదాపు విజయం అంచుకు చేరుకుంది. చివర్లో దీప్తిశర్మ-సోఫీ ఎక్లెస్టోన్ ఒక్కో పరుగు చేస్తూ వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు.
ఈ క్రమంలో చివరి ఓవర్‌లో యూపీ విజయానికి 5 పరుగులు అవసరం కావడంతో ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది. దీనికి తోడు తొలి రెండు బంతుల్లోనూ పరుగులు రాకపోవడంతో విజయం ఎవరికి దక్కుతుందోనన్న ఆందోళన అభిమానుల్లో మొదలైంది. అయితే, మూడో బంతిని ఎక్లెస్టోన్ సిక్సర్‌గా మలిచి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించింది. దీప్తిశర్మ 13, ఎక్లెస్టోన్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా హర్మన్‌ప్రీత్ 25, వోంగ్ 32 పరుగులు చేశాడు. యూపీ బౌలర్లలో ఎక్లెస్టోన్ 3 వికెట్లు తీసుకోగా, గైక్వాడ్ దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Updated Date - 2023-03-18T19:30:42+05:30 IST