Team India: న్యూజిలాండ్‌కు లెక్క సరిచేస్తారా? మళ్లీ లొంగిపోతారా?
ABN, First Publish Date - 2023-10-21T21:25:35+05:30
ఇటీవల కాలంలో ఐసీసీ ఈవెంట్లలో మన జట్టుకు న్యూజిలాండ్ కొరకరాని కొయ్యగా మారింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో చివరిసారిగా 2003లోనే న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించింది.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా అన్నింట్లో విజయాలు సాధించి 8 పాయింట్లతో పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ భారత్‌కు అసలు సిసలు సవాల్ ఆదివారం ఎదురుకానుంది. పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను టీమిండియా ఢీకొట్టబోతోంది. అయితే ఇటీవల కాలంలో ఐసీసీ ఈవెంట్లలో మన జట్టుకు న్యూజిలాండ్ కొరకరాని కొయ్యగా మారింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో చివరిసారిగా 2003లోనే న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించింది. ఆ తర్వాత 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో ఈ రెండు జట్లు తలపడగా న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ తర్వాత ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్‌లలోనూ న్యూజిలాండ్ విజయాలు సాధించింది.
ఇది కూడా చదవండి: IPL 2023: ఐపీఎల్‌తో రికార్డులు బద్దలు కొట్టిన జియో సినిమా
మొత్తంగా వన్డే ప్రపంచకప్‌లలో టీమిండియా, న్యూజిలాండ్ 8 సార్లు తలపడ్డాయి. అయితే 5-3 తేడాతో కివీస్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 1975, 1979లో వరుసగా న్యూజిలాండ్ గెలవగా.. 1987 ప్రపంచకప్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత 1992, 1999లో మళ్లీ కివీస్ గెలిచింది. 2003లో టీమిండియా విజయం సాధించింది. 2007, 2011, 2015 ప్రపంచకప్‌లలో టీమిండియాకు న్యూజిలాండ్‌తో తలపడాల్సిన అవసరం రాలేదు. కానీ 2019 ప్రపంచకప్‌లో సెమీస్‌లో మరోసారి కివీస్ గెలిచింది. ప్రస్తుతం 2023 ప్రపంచకప్‌లో పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఓడిపోలేదు. మరి తొలి ఓటమి ఎవరిదో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. మరి టీమిండియా ఈసారైనా న్యూజిలాండ్‌ను ఓడిస్తుందా.. లేదా ఎప్పటిలాగే లొంగిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Updated Date - 2023-10-21T21:25:35+05:30 IST