Christmas Gifts: ఆస్ట్రేలియాకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు
ABN, Publish Date - Dec 25 , 2023 | 09:28 PM
ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు క్రిస్మస్ గిఫ్టులు అందించడం స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా పాల్గొన్నాడు.
వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడిన ఆస్ట్రేలియా ప్రస్తుతం సొంతగడ్డపై పాకిస్థాన్‌తో తలపడుతోంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు మెల్‌బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్టు కోసం సిద్ధమైంది. అయితే క్రిస్మస్ కావడంతో మెల్‌బోర్న్‌లో సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు క్రిస్మస్ గిఫ్టులు అందించడం స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించాడు. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా పాల్గొన్నాడు. పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్‌లోని కొంతమంది సభ్యులు కలిసి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇండోర్ ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఆస్ట్రేలియా జట్టును బహుమతులతో ఆశ్చర్యపరిచారు.
పాకిస్థాన్ క్రిస్మస్ గిఫ్టులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఆ జట్టును ప్రశంసించాడు. పాకిస్థాన్ జట్టుతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని.. రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌లో పర్యటించడం తమకు ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. పిల్లల కోసం క్రిస్మస్ గిఫ్టులు, చాక్లెట్లు, లాలీపాప్‌లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. తమ గురించి పాకిస్థాన్ ఆలోచించిన తీరు తమను ఆకట్టుకుందన్నాడు. అటు క్రిస్మస్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ మెల్‌బోర్న్ మైదానంలోని చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశాడు. కాగా బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడి ముప్పు ఉందని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 25 , 2023 | 09:28 PM