Rishab pant: రిషబ్ పంత్ కెరియర్‌పై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు...
ABN, First Publish Date - 2023-02-27T19:03:20+05:30
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) కెరియర్‌పై టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్(Pant) తిరిగి భారత జట్టులో చేరి ఆడేందుకు రెండేళ్ల వరకు పడుతుందని అంచనా వేశాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) జట్టు మేనేజ్‌మెంట్ బాధ్యతల్లో ఉన్న గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఢిల్లీ కేపిటల్స్(DC) జట్టులో పంత్ స్థానాన్ని పూడ్చడం కష్టసాధ్యమన్న గంగూలీ.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చేదెవరన్న విషయంలో జట్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. పంత్‌కు ప్రమాదం జరిగిన తర్వాత తాను రెండుసార్లు మాట్లడినట్టు చెప్పాడు. ప్రస్తుతం అతడికి కష్టకాలం నడుస్తోందని, గాయాలు, సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టు తెలిపాడు. పంత్ తిరిగి జట్టులోకి వచ్చి ఆడాలంటే ఏడాది లేదంటే రెండేళ్లయినా పట్టొచ్చని అభిప్రాయపడ్డాడు.
ఢిల్లీ జట్టు ఇంకా పంత్ రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు. యువ ఆటగాళ్లు అభిషేక్ పోరెల్(Abhishek Porel) లేదంటే దేశవాళీ వెటరన్ ఆటగాడు షెల్డన్ జాక్సన్(Sheldon Jackson)ను తీసుకోవాలా? అనే విషయంలో గంగూలీ కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని గంగూలీ చెప్పుకొచ్చాడు.
ఢిల్లీ జట్టు ప్రస్తుతం కెప్టెన్ వేటలో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అనుభవం రీత్యా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఆ చాన్స్ దక్కే అవకాశం ఉంది. కోల్‌కతాలో ఇటీవల ఢిల్లీ జట్టు నిర్వహించిన మూడు రోజుల శిబిరంలో పృథ్వీషా, ఇషాంత్ శర్మ, చేతన్ సకారియా, మనీష్ పాండే తదితరులు కనిపించారు.
Updated Date - 2023-02-27T20:30:45+05:30 IST