ODI World Cup 2023: దక్షిణాఫ్రికా జోరుకు వరుణుడు అడ్డంకి.. ధర్మశాలలో ప్రారంభం కాని మ్యాచ్
ABN, First Publish Date - 2023-10-17T15:53:02+05:30
ధర్మశాలలో నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేశాడు. ధర్మశాలలో నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ వేసిన తర్వాత ధర్మశాలను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో మ్యాచ్ ఆరంభానికి ముందే క్రికెట్ ప్రేక్షకులకు నిరాశ కలిగింది. కాసేపు పడుతూ.. కాసేపు ఆగుతూ వర్షం ఆటగాళ్లను ఆడుకుంటోంది. దీంతో వర్షం పూర్తిగా ఆగితే కానీ మ్యాచ్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడంలేదు. వర్షం తగ్గినా ఓవర్లలో కోత పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇరు జట్లు 43 ఓవర్ల చొప్పున మాత్రమే ఆడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Cricket: SMATలో రికార్డు స్కోరు.. 20 ఓవర్లలో 275 పరుగులు
కాగా ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలో దిగేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్ ఆడిన షాంసీ స్థానంలో కొయిట్జెను తీసుకుంది. అటు నెదర్లాండ్స్ కూడా ఒక మార్పు చేసింది. గత మ్యాచ్ ఆడిన ర్యాన్ క్లీన్ స్థానంలో లోగన్ వాన్ బీక్ తుది జట్టులో స్థానం సంపాదించాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా రెండింట్లోనూ విజయం సాధించి 4 పాయింట్లతో టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, శ్రీలంకపై దక్షిణాఫ్రికా అద్భుత విజయాలు సాధించింది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు నెదర్లాండ్స్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతోంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలిచే అవకాశం లేదు.
Updated Date - 2023-10-17T15:53:02+05:30 IST