Team India: కష్టాల్లో టీమిండియా మాజీ కోచ్.. అడుక్కోవాల్సిన పరిస్థితి..!!
ABN, First Publish Date - 2023-10-26T18:36:52+05:30
ఆస్ట్రేలియా లెజెండ్‌గా పేరు గాంచిన గ్రెగ్ ఛాపెల్ గతంలో టీమిండియా కోచ్‌గా సేవలు అందించాడు. కానీ ప్రస్తుతం అతడు ఆర్ధిక కష్టాలతో సతమతం అవుతున్నాడు. దీంతో అతడి స్నేహితులు ఫండ్స్ సేకరించి సహాయం చేసే పనిలో ఉన్నారు.
టీమిండియాలో ఇప్పటివరకు వివాదాస్పదమైన కోచ్ ఎవరు అని అభిమానులను అడిగితే అందరూ చెప్పే ఏకైక మాట గ్రెగ్ ఛాపెల్. అతడి హయాంలో టీమిండియా ఎంత ఘోరంగా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగూలీ, టెండూల్కర్, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాల కారణంగా జట్టు చెల్లాచెదురుగా మారి పతనం దిశగా సాగింది. ఆస్ట్రేలియా క్రికెట్‌తో పోలిస్తే ఇండియన్ క్రికెట్ గొప్పగా ఉండకూడదని భావించాడో ఏమో కానీ అలాంటి పేలవ కోచ్ ఆధ్వర్యంలో 2007 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన చేసింది. దీంతో విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో బీసీసీఐ గ్రెగ్ ఛాపెల్‌ను తప్పించి టామ్ మూడీని రంగంలోకి దించింది. కట్ చేస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా లెజెండ్‌గా పేరు గాంచిన గ్రెగ్ ఛాపెల్ ఆర్ధిక కష్టాలతో సతమతం అవుతున్నాడు. దీంతో అతడి స్నేహితులు ఫండ్స్ సేకరించి సహాయం చేసే పనిలో ఉన్నారు.
సాధారణంగా మాజీ క్రికెటర్లు అందులోనూ లెజెండరీ క్రికెటర్లు విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. కానీ గ్రెగ్ ఛాపెల్ మాత్రం తన స్వయం తప్పిదాలతో ఆర్థిక కష్టాలకు గురయ్యాడు. దీంతో తన సహచర క్రికెటర్ల మాదిరిగా జీవించలేకపోతున్నాడు. ఈ అంశంపై గ్రెగ్ ఛాపెల్ కూడా స్పందించాడు. తాను మరీ తీరని కష్టాల్లో ఏమీ లేనని.. కానీ ఈతరం ఆటగాళ్లు పొందుతున్న ప్రయోజనాలను మాత్రం ఆనాటి క్రికెటర్లు పొందలేకపోతున్నారని అన్నాడు. క్రికెట్ ఆడిన ప్రతి వ్యక్తి విలాసవంత జీవితం గడపాలని భావిస్తాడని.. కానీ తాము అలా కాదని పేర్కొన్నాడు.
కాగా ఓ నివేదిక ప్రకారం గత వారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఓ సమావేశంలో స్నేహితులు GoFundMe పేజీ క్రియేట్ చేయగా గ్రెగ్ ఛాపెల్ అయిష్టంగానే అంగీకారం తెలిపాడు. ఈ సమావేశానికి గ్రెగ్ ఛాపెల్ సోదరులు ఇయాన్ ఛాపెల్, ట్రెవర్ ఛాపెల్ కూడా హాజరయ్యారు. రిటైర్మెంట్ తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌లో భాగంగానే ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏకైక క్రికెటర్‌ను తానేనని గ్రెగ్ ఛాపెల్ వివరించాడు. నిజంగా చెప్పాలంటే తన స్నేహితులు సేకరిస్తున్న ఫండ్స్‌ను తన కోసమే కాకుండా తన కాలంలో క్రికెట్ ఆడి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ల కోసం కూడా ఖర్చు చేస్తానని తెలిపాడు. తన సహాయంతో ఈరోజు ఉన్నత స్థితికి ఎదిగిన క్రికెటర్లు తన పాత్రను గుర్తిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నాడు. అటు ఛాపెల్ ఫౌండేషన్‌ను ఆయన స్నేహితుడు దర్శక్ మెహతా నడుపుతున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా సేకరించిన డబ్బు 100 శాతం పేదకుటుంబాలకు పంపిణీ చేస్తున్నట్లు ఛాపెల్ స్నేహితుడు పీటర్ మలోనీ తెలిపారు.
Updated Date - 2023-10-26T18:36:52+05:30 IST