Shinde Meets Raj: రాజ్‌థాకరేను కలిసిన సీఎం షిండే.. విమర్శల పర్యవసానమేనా?
ABN, First Publish Date - 2023-03-27T16:37:22+05:30
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరేను ముంబైలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే..
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరేను (Raj Thackeray) ముంబైలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సోమవారంనాడు కలుసుకున్నారు. ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వం ముంబై నగర సుందరీకరణకు రూ.1,700 కోట్లు వెచ్చించడంపై గత బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీలో రాజ్ థాకరే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాజ్‌థాకరేను షిండే కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, మర్యాదపూర్వకంగానే ఉభయనేతలు కలిసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజ్ వీడియో సంచలనం...
ముంబై తీర ప్రాంతంలో సమాధి తరహా నిర్మాణం ఒకటి అక్రమంగా నిర్మించడంపై ఎంఎన్ఎస్ చీఫ్ ఈ వారం మొదట్లో ఒక వీడియో విడుదల చేశారు. ఆ మరుసటి రోజే ఆ నిర్మాణాన్ని మహారాష్ట్ర యంత్రాంగం కూల్చేసింది. దీనిపై షిండే క్యాబినెట్ మంత్రి దీపక్ కేసార్కర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, బాలాసాహెబ్ థాకరే బాటలోనే మహారాష్ట్ర అడ్మినిస్ట్రేషనమ్ నడుస్తోందన్నారు. ఏక్‌నాథ్ సిండే సైతం ఒక ప్రకటనలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. బాలాసాహెబ్ కలలను సాకారం చేయడానికి తమ ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు. గతంలో బాలాసాహెబ్ ఈ తరహా అంశాలు లేవనెత్తేవారని, ఇప్పుడు వాటిని రాజ్ థాకరే లేవనెత్తుతున్నారని ప్రశంసించారు. రాజ్‌థాకరే కారణంగానే 'కోస్టల్ రెగ్యురేషన్ జోన్ చట్టం' ఉల్లంఘన జరుగుతోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకున్నట్టు సీఎం వివరణ ఇచ్చారు.
కాగా, రాజ్‌థాకరే ఇటీవల జరిపిన ర్యాలీలో లౌడ్‌స్పీకర్ల వ్యవహారంపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు. మసీదులను నుంచి లౌడ్‌స్పీకర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించకుంటే, తాను తిరిగి హిందుత్వ ప్రచారాన్ని ప్రారంభిస్తానని ఆయన అన్నారు. గత ఏడాది మసీదులపై లౌడ్‌స్పీకర్లు తొలగించాలంటూ నిరసనలు తెలిపిన తమ పార్టీకి చెందిన 17,000 మందికి పైగా కార్యకర్తలపై ఫిర్యాదులు నమోదు చేశారని, వాటిని కొట్టివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2023-03-27T16:37:51+05:30 IST