Mitchell Marsh : మిచెల్ మార్ష్‌పై ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు.. ఏం జరుగుతుందో..!?
ABN, First Publish Date - 2023-11-24T12:46:56+05:30
FIR Registered Against Mitchell Marsh : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ (World Cup) గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆసిస్ స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ప్రపంచకప్ ట్రోఫిపై కాళ్లు పెట్టి మద్యపానం సేవిస్తూ దిగిన ఫోటో పెను సంచలనమైంది..
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ (World Cup) గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆసిస్ స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ప్రపంచకప్ ట్రోఫిపై కాళ్లు పెట్టి మద్యపానం సేవిస్తూ దిగిన ఫోటో పెను సంచలనమైంది. ఈ ఘటనను జీర్ణించుకోలేని క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. అయితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పండిట్ కేశవ్ (RTI Activist Pandit Keshav) ఢిల్లీ గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మిచెల్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. కాగా.. ట్రోఫీని అవమానించడంతో పాటు 140 మంది భారతీయుల సెంటిమెంట్‌ను గాయపరిచారని ఫిర్యాదులో పండిట్ కేశవ్ రాసుకొచ్చారు. ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారనే దానిపై సర్వత్రా ఆసక్తిగా మారింది.
అసలేం జరిగింది..?
ట్రోఫీ గెలిచిన తర్వాత ఆసిస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇలా ఈ వివాదాస్పద ఫొటో బయటికి వచ్చింది. వైరల్‌గా మారిన ఫోటోల్లో కుర్చీపై కూర్చున్న మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీ తన రెండు కాళ్లను పెట్టాడు. అంతేకాకుండా మద్యం కూడా సేవిస్తున్నాడు. దీంతో మిచెల్ మార్ష్ తీరుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఇంత అహంకారామా..? అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచకప్ ట్రోఫీని గౌరవించుకోవడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎన్ని ట్రోఫీలు గెలిచినా ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రవర్తనలో మార్పు రాదని జనాలు తిట్టిపోశారు. ఈ సందర్భంగా.. 1983లో టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు కెప్టెన్ కపిల్ దేవ్ ట్రోఫిని తలపై పెట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేసి.. ఇది చూసి నేర్చుకోవాలని మార్ష్‌కు సూచించారు కూడా.
Updated Date - 2023-11-24T12:50:35+05:30 IST