IND vs AUS 3rd ODI: స్టీవెన్ స్మిత్ ఖాతాలో అరుదైన రికార్డు
ABN, First Publish Date - 2023-09-27T16:31:50+05:30
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డును చేరుకున్నాడు. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన వన్డే కెరీర్‌లో 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
రాజ్‌కోట్: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డును చేరుకున్నాడు. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన వన్డే కెరీర్‌లో 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో 5 వేల పరుగులు చేసిన 17వ బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో స్మిత్‌కు ఇది 30వ హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 61 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు. ఇక తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 145 మ్యాచ్‌లాడిన స్మిత్ 44 సగటుతో 5054 పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు, 12 సెంచరీలున్నాయి.
ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఆసీస్ బ్యాటర్లు ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ తొలి వికెట్‌కు 8 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. దీంతో టీ20 స్టైల్‌లో ఆసీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 6.1 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. అయితే ఈ భాగస్వామ్యాన్ని 9వ ఓవర్ మొదటి బంతికి ప్రసిద్ధ్ క్రిష్ణ విడదీశాడు. 6 ఫోర్లు, 4 సిక్సులతో 34 బంతుల్లోనే 56 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత స్టీవెన్ స్మిత్‌తో కలిసి మార్ష్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం పూర్తైంది. 20 ఓవర్లలోనే ఆసీసీ స్కోర్ 146 పరుగులకు చేరుకుంది. అయితే సెంచరీకి చేరువైన మిచెల్ మార్ష్‌ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. 13 ఫోర్లు, 3 సిక్సులతో 84 బంతుల్లోనే 96 పరుగులు చేసిన మార్ష్ 4 పరుగలు వ్యవధిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ కాసేపటికే స్మిత్(74)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. అప్పటివరకు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోయిన ఆసీస్ స్కోర్ బోర్డులో స్మిత్ ఔట్‌తో కాస్త వేగం తగ్గింది. ఆ కాసేపటికే అలెక్స్ క్యారీని(11) బుమ్రా ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 37 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది.
Updated Date - 2023-09-27T16:37:35+05:30 IST