India vs Pakistan మ్యాచ్ జరుగుతున్న స్టేడియం దాదాపు సగం ఖాళీ! ఇలా జరగడానికి కారణమేంటంటే..?
ABN, First Publish Date - 2023-09-10T20:06:35+05:30
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు స్టేడియాలు నిండిపోతాయి. వేదిక ఎక్కడైనా సరే స్టేడియాలకు అభిమానులు పొటెత్తుతారు. టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అయిపోతాయి.
కొలంబో: భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు స్టేడియాలు నిండిపోతాయి. వేదిక ఎక్కడైనా సరే స్టేడియాలకు అభిమానులు పొటెత్తుతారు. టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అయిపోతాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరిగిన ఉండే క్రేజ్ అలాంటిది. కానీ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను స్టేడియాలకు వచ్చి చూసే అభిమానులు కరువయ్యారంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను స్టేడియాలకు వచ్చి చూడడానికి అభిమానులు ఆసక్తి చూపడం లేదు. సూపర్ 4లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో అయితే ఏకంగా 15 వేల టికెట్లు అమ్ముడుపోలేదు. మ్యాచ్‌కు అతిథ్యం ఇచ్చిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియం కెపాసిటీ 35 వేలు కాగా.. అందులో 20 వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే 40 శాతం టికెట్లు అమ్ముడుపోలేదు. లీగ్ స్టేజ్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో స్టేడియం చాలా వరకు ఖాళీగా కనిపిస్తోంది. సాధారణంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానులతో కిక్కిరిసిపోతుంటుంది. అలాంటిది స్టేడియాలు ఖాళీగా ఉండడం చూసి క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులు కూడా షాక్‌కు గురవుతున్నారు.
అయితే మ్యాచ్‌ను స్టేడియానికి వచ్చి చూడడానికి అభిమానులు ఆసక్తి చూపించడకపోవడానికి కారణాలు లేకపోలేదు. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు ఉందని ముందే వార్తలు రావడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఏకంగా 90 శాతం వర్షం పడే అవకాశాలు ఉండడంతో అభిమానులు స్టేడియానికి రావడానికి ఆసక్తి చూపలేదంటున్నారు. పైగా ఇప్పటికే లీగ్ దశలో జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఆ తరహా సూచనలే ఉన్నాయి. అయితే సూపర్ 4 మ్యాచ్‌కు రిజర్వ్ డే పెట్టిన అభిమానులు పెదగా స్టేడియానికి రాకపోవడం కాస్త ఆశ్చర్యపరిచే అంశమే అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా భారత్, పాక్ పోరుకు అభిమానుల తాకిడి తగ్గడం ఆందోళన కల్గించే అంశమేనని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా వర్షంతో పని లేకుండా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు అభిమానులు ఎగబడుతుంటారు. ఇక అనుకున్నట్టుగానే సూపర్ 4లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(8), రాహుల్(17) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుభ్‌మన్ గిల్(58) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ అయ్యారు.
Updated Date - 2023-09-10T20:07:19+05:30 IST