IND vs WI 1st ODI: తిప్పేసిన స్పిన్నర్లు.. 23 ఓవర్లకే కుప్పకూలిన వెస్టిండీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
ABN, First Publish Date - 2023-07-27T21:40:27+05:30
టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/6), రవీంద్ర జడేజా (3/37) విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు.
బార్బడోస్: టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/6), రవీంద్ర జడేజా (3/37) విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు. హార్దిక్ పాండ్యా మూడో ఓవర్లోనే ఓపెనర్ కైల్ మేయర్స్(2)ను పెవిలియన్ చేర్చాడు. టెస్టు సిరీస్‌లో రాణించినా అలిక్ అథనాజ్(22)ను అరంగేట్ర పేసర్ ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో ఓపెనర్ బ్రాండన్ కింగ్(17)ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 45 పరుగులకే విండీస్ టాప్ 3 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఆ జట్టును కెప్టెన్ షాయ్ హోప్, షిమ్రోన్ హెట్‌మేయర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు.
కానీ స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. విండీస్ వికెట్లు టపటప రాలాయి. హెట్‌మేయర్(11)ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా జడ్డూ ఈ పాట్నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. దీంతో 88 పరుగుల వద్ద కరేబియన్లు నాలుగో వికెట్ కోల్పోయారు. ఆ తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన జడ్డూ.. రోవ్మాన్ పావెల్(4), రొమారియో షెపర్డ్‌ను పెవిలియన్ చేర్చాడు. షెపర్డ్ డకౌట్ అయ్యాడు. దీంతో 96 పరుగులకు విండీస్ 6 వికెట్లు కోల్పోయింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ కెప్టెన్ షాయ్ హోప్ మాత్రం ఒంటరి పోరాటం చేసే ప్రయత్నం చేశాడు. కానీ కుల్దీప్ ఎంట్రీతో విండీస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ చైనామన్ స్పిన్నర్ మిగతా 4 వికెట్లను తన 3 ఓవర్ల కోటాలోనే తీశాడు. డొమినిక్ డ్రేక్స్(3), యానిక్ కరియా(3), షాయ్ హోప్(43), జేడెన్ సీల్స్(0)ను వెంట వెంటనే పెవిలియన్ చేర్చాడు. దీంతో 23 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన విండీస్ 114 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా 3, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.
Updated Date - 2023-07-27T21:44:26+05:30 IST