ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cricket World Cup2023: మనోళ్లు... ఎందుకు గెలవాలంటే..

ABN, First Publish Date - 2023-10-01T08:50:17+05:30

భారత్‌లో క్రికెట్‌ను ఓ ఆటగా ఏ మాత్రం చూడరు. చిన్నా.. పెద్దా తేడా లేకుండా దీన్నంతా ఓ మతంలానే భావిస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరిస్తుంటుంది.....

భారత్‌లో క్రికెట్‌ను ఓ ఆటగా ఏ మాత్రం చూడరు. చిన్నా.. పెద్దా తేడా లేకుండా దీన్నంతా ఓ మతంలానే భావిస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరిస్తుంటుంది. కారణం.. ఐసీసీకి అత్యధిక రెవెన్యూ (ఆదాయం) భారత్‌ నుంచే వెళుతుంది కాబట్టి. మరి.. ఇంత క్రేజ్‌ ఉన్న ఆటపై టీమిండియా ఆధిపత్యం ఎలా ఉందంటే.. జవాబు చెప్పడం కష్టమే. ద్వైపాక్షిక సిరీస్‌ విజయాల సంగతి ఎలా ఉన్నా మేజర్‌ టోర్నమెంట్లలో మన జట్టు ఒత్తిడిని తట్టుకోలేక పోతుండడం అభిమానులను కలిచివేస్తోంది. భారత్‌ చివరిసారిగా గెలుచుకున్న పెద్ద టోర్నమెంట్‌ ధోనీ నేతృత్వంలో దక్కించుకున్న 2013 చాంపియన్స్‌ ట్రోఫీ మాత్రమే.. ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించి భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. అంతే.. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఐసీసీ నిర్వహించిన ఏ టోర్నీని కూడా మన హీరోలు గెలుచుకోలేకపోయారు. ఓసారి వాటిని పరిశీలిస్తే..

  • 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంక జట్టు చేతిలో ఓటమి

  • 2015 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

  • 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వెస్టిండీస్‌ చేతిలో పరాజయం

  • 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమి

  • 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం

  • 2021 టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలోనే వెనక్కి

  • 2022 టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి..


ఇలా దగ్గరిదాకా వచ్చి అభిమానులను భారత జట్టు ఉస్సూరుమనిపించింది. వాస్తవానికి పై టోర్నమెంట్లలో మనోళ్లు హాట్‌ ఫేవరెట్‌గానే పోటీపడ్డారు. గ్రూప్‌ దశలో అద్భుత ఆటతీరును కనబరుస్తూ.. కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో మాత్రం తడబాటుకు గురవ్వడం సహజంగా జరిగిపోతోంది. ధోనీ కెప్టెన్సీలో యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా మిడిలార్డర్‌లో అదరగొట్టేవారు. ఈ ఇద్దరూ పార్ట్‌టైమ్‌ బౌలర్లుగానూ రాణించేవారు. ప్రస్తుతం జట్టులో వీరి స్థాయిలో నమ్మదగ్గ ఆల్‌రౌండర్లు కనిపించడం లేదు. జడేజా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. ఇక ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లకు ముందు బిజీ షెడ్యూల్‌ ఉంటోంది. ఆటగాళ్లు అలసటకు గురికావడం, గాయాలతో బాధపడుతుండడం జరుగుతోంది.

చివరి టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. అలాగే జట్టు కూర్పులో అనేక మార్పులు కూడా ఆటగాళ్లలో విశ్వాసాన్ని నింపలేకపోతోంది. ప్రపంచకప్‌లో ఆడే జట్టు వీలైనంత ఎక్కువగా బరిలోకి దిగితే వారికి సరైన ప్రాక్టీస్‌ లభించినట్టవుతుంది. కానీ ఇటీవలి ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌ రోహిత్‌, విరాట్‌, హార్దిక్‌, కుల్దీప్‌లకు విశ్రాంతినిచ్చి చివరి మ్యాచ్‌ను ఆడించారు. అసలు టోర్నీ జట్టులో లేని రుతురాజ్‌తో ఓపెనింగ్‌ చేయించడం గమనార్హం. ఇలా కీలక టోర్నమెంట్‌ ముందు ప్రయోగాలు ఏమాత్రం ఫలితాన్నివ్వవు. ఏదిఏమైనా అసలైన మ్యాచ్‌ల్లో తమ అనుభవాన్నంతా రంగరించి మన స్టార్‌ ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తారని ఆశిద్దాం. అదీ సొంత గడ్డపైనే కావడం మరో సానుకూలాంశం. అన్నీ అనుకూలంగా జరిగి దశాబ్ద కాల ట్రోఫీ కరవు తీరాలంటే టీమిండియా కచ్చితంగా స్వదేశంలో గెలవాల్సిందే.. గెలిచి మువ్వన్వెల త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాల్సిందే!

'

-ఎన్‌.ఆర్‌

Updated Date - 2023-10-01T10:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising