Neeraj Chopra: నీరజ్ విప్లవం
ABN, First Publish Date - 2023-08-29T01:22:48+05:30
క్రికెట్(Cricket) దేశంగా పేరొందిన భారత్(India)లో మిగతా క్రీడలకు ఆదరణ కరవు అనేది నిన్నటి మాట. కపిల్ డెవిల్స్(Kapil Devils) వరల్డ్‌కప్ విక్టరీ దేశంలో క్రికెట్ విప్లవానికి ఎలా నాంది పలికిందో.. అంతర్జాతీయ వేదికలపై బల్లెం వీరుడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) వరుస విజయాల ప్రభావం భవిష్యత్ తరంపై అలాంటి ముద్ర వేస్తోంది.
దేశ క్రీడల్లో సరికొత్త స్ఫూర్తి ప్రదాత
న్యూఢిల్లీ: క్రికెట్(Cricket) దేశంగా పేరొందిన భారత్(India)లో మిగతా క్రీడలకు ఆదరణ కరవు అనేది నిన్నటి మాట. కపిల్ డెవిల్స్(Kapil Devils) వరల్డ్‌కప్ విక్టరీ దేశంలో క్రికెట్ విప్లవానికి ఎలా నాంది పలికిందో.. అంతర్జాతీయ వేదికలపై బల్లెం వీరుడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) వరుస విజయాల ప్రభావం భవిష్యత్ తరంపై అలాంటి ముద్ర వేస్తోంది. అతడి విజయ నాదం.. యావద్దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. చోప్రా స్ఫూర్తితో జావెలిన్(Javelin) చేతబట్టేందుకు యువత క్యూ కడుతున్నారు. తాజాగా వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో చోప్రా అందించిన స్వర్ణ పతకంతో దేశ ప్రజలు ఫిదా అయ్యారు. అయితే, అందరూ పెద్దగా గమనించని విషయం ఏంటంటే ఫైనల్లో ముగ్గురు భారత త్రోయర్లు టాప్-6లో చోటు దక్కించుకోవడం. నీరజ్‌తోపాటు కిషోర్ జనా (ఒడిశా), డీపీ మను (కర్ణాటక) ఐదు, ఆరు స్థానాల్లో నిలిచి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.
పవర్ హౌస్‌లకు దక్కనిది..: 1983లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్స ఆరంభమయ్యాక టాప్-6లో ఒక దేశానికి చెందిన త్రయం నిలవడం ఇదే ప్రథమం. జావెలిన్ పవర్‌హౌస్ జర్మనీ, అమెరికా, ఫిన్లాండ్ నుంచి ముగ్గురేసి త్రోయర్లు గతంలో పాల్గొన్నారు. కానీ, ఫైనల్ టాప్-6లో నిలవలేదు. ఇప్పుడు భారత్ ఆ రికార్డును బద్దలుకొట్టిందంటే అది నీరజ్ మహిమే..! ఒకవేళ రోహిత్ యాదవ్ గాయంతో తప్పుకోకపోతే.. భారత్ తరఫున నాలుగో త్రోయర్ కూడా పోటీల్లో ఉండేవాడేమో..! జావెలిన్ త్రోకు పెరుగుతున్న ఆదరణను చూస్తుంటే.. భవిష్యత్‌లో మేజర్ టోర్నీల్లో ఈ విభాగంలో ఒకటి కంటే ఎక్కువ పతకాలు దక్కే రోజు వస్తుందని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీలకంగా ఉన్న జావెలిన్ త్రోయర్లలో 9 మంది 80 మీటర్ల మార్క్‌ను అందుకోవడం శుభపరిణామం. ఇంత మంది అథ్లెట్లు ఏదేశానికీ అందుబాటులో లేరు. భారత అథ్లెట్లు కూడా పతకాలు నెగ్గగలరనే ఆత్మవిశ్వాసాన్ని చోప్రా ప్రతి ఒక్కరిలో నెలకొల్పాడని జనా కోచ్ సమర్ జీత్ సింగ్ అన్నాడు. భవిష్యత్‌లో మరింత మంది స్టార్లు వెలుగుచూడగలరన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. జావెలిన్ క్రీడను మరింత చేరువ చేసేందుకు ఏఎ్‌ఫఐ.. అండర్-14 స్థాయిలో ‘కిడ్స్ జావెలిన్’ కార్యక్రమాన్ని ఆరంభించింది. పట్నాలో జరిగిన ‘కిడ్స్ జావెలిన్’ పోటీల్లో పాల్గొనేందుకు 1137 మంది బాలురు, 849 మంది బాలికలు తమ పేర్లను నమోదు చేసుకొన్నారంటే.. నీరజ్ ఎఫెక్ట్ కాక మరేమను కోవాలి..!
చోప్రాకు రూ. 58 లక్షలు.. అర్షద్‌కు రూ. 29 లక్షలు
ప్రపంచ చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలిచిన నీరజ్ చోప్రాకు లభించిన ప్రైజ్‌మనీ ఎంతంటే.. అక్షరాలా రూ. 58 లక్షలు . రన్నర్‌పగా నిలిచి రజత పతకం అందుకున్న పాకిస్థానీ అర్షద్ నదీమ్‌కు రూ. 29 లక్షలు బహుమతిగా దక్కింది. కాంస్య విజేత జాకబ్ (చెక్ రిపబ్లిక్)కు రూ. 18 లక్షలు దక్కాయి.
హద్దంటూ లేదు
త్రోయర్లకు ఓ హద్దంటూ లేదు. నూతనోత్సాహంతో మరింత దూరం జావెలిన్‌ను విసరాలనేదే ప్రయత్నం. నేను మరింతగా శ్రమిస్తా.. మరిన్ని మెడల్స్ కొల్లగొడతా. ఈసారి మరో భారతీయుడు నాతోపాటు పోడియంపై నిల్చుంటే ఎంతో గొప్పగా భావిస్తా. రానున్న రోజుల్లో 90 మీటర్ల మార్క్‌ను కూడా అందుకొంటా.
- నీరజ్ చోప్రా
విసిరితే.. అలా విసరాలి
వరల్డ్ అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాపై క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత క్రీడలకు ఇది చారిత్రక దినం. బరిలోకి దిగిన ప్రతీసారి నీ కష్టం ఫలిస్తోంద’ని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. మరో స్వర్ణం సాధించిన చోప్రాకు వీవీఎస్ లక్ష్మణ్ అభినందనలు తెలిపాడు. అలాగే ‘విసిరితే అలా విసరాలి.. నలుగురు ఏం విసిరాడురా అనేట్టు..! నీ జైత్రయాత్ర ఇలాగే కొనసాగాల’ని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కపిల్‌దేవ్, గౌతమ్ గంభీర్, రవి శాస్త్రి కూడా నీరజ్‌ను ప్రశంసిస్తూ సందేశాలు పంపారు.
ఇంటికెళ్లి రెండేళ్లయింది
ఆఖరి నిమిషంలో వీసా రావడంతో బుడాపెస్ట్‌కు వెళ్లిన కిశోర్ జనా ఫైనల్లో 84.77 మీటర్లు ఈటెను విసిరి ఐదో స్థానంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చోప్రా ప్రోత్సాహంతోనే తాను ఆ మార్క్‌ను అందుకొన్నట్టు తెలిపాడు. ఈ సందర్భంగా కొన్నేళ్లుగా తాను పడుతున్న కష్టాన్ని జనా గుర్తు చేసుకొన్నారు. ప్రాక్టీస్, టోర్నీలతో రెండేళ్లుగా కనీసం తల్లిదండ్రులను చూడడానికి కూడా ఇంటికి వెళ్లలేక పోయానన్నాడు. ఇక, పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వాల్సిన పరిస్థితుల్లో మరో ఏడాదిపాటు వారికి దూరంగా ఉండనున్నట్టు చెప్పాడు. అయితే, తాను ఇలా రాణిస్తున్నానంటే దానికి కుటుంబ సహకారం ఎంతో ఉందని చెప్పాడు. ఒడిశాకు చెందిన జనా రైతు బిడ్డ. ఆరుగురు అక్కచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడు. సీఐఎ్‌సఎఫ్ ఉద్యోగి అయిన కిషోర్.. ఆసియాడ్‌లో స్వర్ణం సాధించడమే తన తర్వాతి లక్ష్యమని చెప్పాడు.
Updated Date - 2023-08-29T04:45:09+05:30 IST