World Cup: చలో అహ్మదాబాద్.. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఫీవర్
ABN, First Publish Date - 2023-11-18T08:17:06+05:30
రేపు జరగనున్న వరల్డ్ కప్(World Cup) ఫైనల్ చూసేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్(Ahmedabad)కు క్యూకడుతున్నారు.
- వరల్డ్ కప్ ఫైనల్ కోసం క్యూకడుతున్న అభిమానులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
రేపు జరగనున్న వరల్డ్ కప్(World Cup) ఫైనల్ చూసేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్(Ahmedabad)కు క్యూకడుతున్నారు. భారత్-అస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు నగరం నుంచి పెద్దసంఖ్యలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్(Hyderabad) నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన సర్వీసులకు భారీగా డిమాండ్ పెరిగింది. సంస్థలు టికెట్ల ధరలు అమాంతంగా పెంచేశాయి. మ్యాచ్‌కు ఒక రోజు ముందు అంటే శనివారమే ఎక్కువ మంది అహ్మదాబాద్‌కు చేరుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. శనివారం ఈ రూట్‌లో సర్వీసుల విమాన టికెట్ ధర ఏకంగా రూ. 35,999లు పలికింది. ఇండిగో సంస్థ హైదరాబాద్ నుంచి నేరుగా అహ్మదాబాద్ నడుపుతున్న నాలుగు సర్వీసుల్లో టికెట్లు ఇదే ధర పలకడం గమనార్హం.
Updated Date - 2023-11-18T08:17:09+05:30 IST